పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. వరద నీరు రోడ్లపైకి చేరటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలెంలో జల్లేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. జైహింద్, సుద్దవాగు, బైనేరు వాగులు ఎర్రకాలువ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయం, కొవ్వాడ, గుబ్బలమంగమ్మ జల్లేరు, జలాశయాల గేట్లు ఎత్తివేశారు.
ఎర్రకాలువ జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోపాలపురం పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో వేల ఎకరాల్లో వరి, పొగాకు నారుమళ్లు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల ప్రజలు ప్రమాదాల బారిన పడ్డారు. తడికలపూడిలో చేపల వేటకు వెళ్లి వాగులో పడి 55 సంవత్సరాల వ్యక్తి గల్లంతయ్యాడు. టి.నరసాపురం మండలం మద్యాహనపువారిగూడెంలో ఇల్లు కూలిపోయింది.
తాడేపల్లిగూడెంలో..
పట్టణంలోని హౌసింగ్ బోర్డ్, FCI కాలనీ, కడకట్ల, రామచంద్రరావుపేట, టీచర్స్ కాలనీ, యగర్లపల్లి వంటి ప్రాంతాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఎక్కడికక్కడ జనసంచారం నిలిచిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు పంటలు నీట మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నందమూరు లాకుల వద్ద ఎర్రకాలువ వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఇదీ చదవండీ..ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి: ఉత్తర్వులు జారీ