పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతికి ముందే కోడిపందాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. కరోనా కారణంగా కోడిపందాలను నిషేధిస్తూ కోర్టులు, అధికారులు ఎంత మొత్తుకున్నా.. పండుగ మూడురోజులూ జరిపి తీరుతామని పందెంరాయుళ్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా బరులను తయారు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా.. జాతీయ రహదారి పక్కనా వాటిని ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గతంలో పందాలు నిర్వహించిన చోట మళ్లీ నిర్వహిస్తారనే ఉద్దేశంతో.. ఆయా ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోడిపందాలను నిరోధించాల్సిందేనని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పందెంరాయుళ్లు అవేవీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. బరితెగించి బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తణుకు సర్కిల్ పరిధిలో 500 మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు నాలుగు వేల కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఓ వైపు పందెం రాయుళ్ల బరితెగింపు, మరోవైపు పోలీసుల నిరోధక చర్యలు కొనసాగుతుండగా.. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఇదీ చదవండి: