CROP HOLIDAY: వరుస నష్టాలతో కుదేలవుతున్న ఆక్వా సాగుదారుల పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని ఆదుకోవాలని.. లేకుంటే పంట విరామమే శరణ్యమని ఆక్వా రైతు ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆక్వా సాగుదారుల రాష్ట్ర స్థాయి సమావేశం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం సాయంత్రం జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సాగుదారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను వివరించారు. ‘ఇకనైనా ఐక్యంగా ముందుకు సాగుదామా...పంట విరామం ప్రకటిద్దామా?’ అంటూ వేదికపై ఉన్న ప్రతినిధులు ప్రశ్నించగానే హాజరైన ఆక్వా రైతులు సమ్మతి తెలిపారు. ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. నాణ్యమైన సీడ్ సరఫరా అయ్యేలా, మేతల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎగుమతిదారులంతా ఒక్కటై ధరలు తగ్గించేస్తున్నారని.. దీనివల్ల రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోందని తెలిపారు. విద్యుత్తు రాయితీని కొనసాగించాలని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోకుంటే.. ఆగస్టు ఒకటి నుంచి పంట విరామం దిశగా ముందుకు వెళ్తామని ప్రకటించారు. పశ్చిమ, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ పర్యవేక్షణ అవసరం..:
హేచరీల్లో సీడ్ ఉత్పత్తి, సరఫరాపై ప్రభుత్వ పర్యవేక్షణ అవసరం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. అంతర్జాతీయంగా సోయాబీన్‌కు డిమాండ్ ఏర్పడటం వల్లే మేతల ధర పెంచామని తయారీదారులు గతంలో చెప్పారు. తరువాత సోయాబీన్ సరఫరా సాధారణ స్థాయికి వచ్చినా మేతల ధరలు మాత్రం తగ్గించడం లేదు. ఇలా అయితే ఆక్వా సాగు ఎలా చేయగలం. - కె.ప్రవీణ్, గుంటూరు
ఐక్యంగా ముందుకు..:
ఇప్పటి వరకు ఎవరికి వారే అన్నట్లు ఉన్నాం. ఇక నుంచి రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. విద్యుత్తు రాయితీ రూపంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏకైక సాయాన్ని నిలిపివేస్తే ఆక్వా రైతులు చేయగలిగింది ఏమీ లేదు. విద్యుత్తు రాయితీని కొనసాగించాలి. - వై.వెంకట ఆనంద్, కోనసీమ
ఇవీ చదవండి: