రైతుల ఉచిత విద్యుత్ హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు, బిల్లులకు నగదు బదిలీ పథకం రైతుల మెడలకు ఉరితాళ్లు అని వారన్నారు. జిఓ 22ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్ పేటలోని అన్నే భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం నుంచి చేపడుతున్న కారణంగా.. ఈ నెల 30న రైతు సంఘాలు చలో శ్రీకాకుళం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రైతులు విద్యుత్ పోరాటానికి సమాయత్తం కావాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.నరసింహారావు, అఖిలభారత రైతు కూలీ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాథ్, ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ మాట్లాడారు.
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు వలన భవిష్యత్తులో రైతులు ఉచిత విద్యుత్తును కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ఉచితాలు, సబ్సిడీలు ఉండడానికి వీల్లేదని రాష్ట్రాలను ఆదేశించిందని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్రం తెచ్చిన విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసి రైతులపై భారాలు వేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా రైతులు ఉచిత విద్యుత్ సాధించుకున్నారని వివరించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని ప్రయత్నిస్తే ఆరోజు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఈరోజు మీటర్ల బిగించి రైతుల గొంతులు కోయాలను కోవడం తగదన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు జగన్ ఇచ్చిన వాగ్దానానికి భిన్నమని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో 22 రద్దుచేసి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు, నగదు బదిలీ పథకం అమలును ఉపసంహరించుకోవాలని కోరారు. రైతులంతా ముక్తకంఠంతో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: