AP Aqua University: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని శంకుస్థాపనలు చేశారంటే, లెక్క పెట్టడం కొంచెం కష్టమే. మరీ శంకుస్థాపన చేసిన వాటిలో ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయంటే, లెక్క పెట్టడానికి అక్కడ ఏమీ లేవు. ఈ కోవలోకే నరసాపురంలో సీఎం జగన్ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన ఆక్వా విశ్వవిద్యాలయం వస్తుంది. ప్రచార ఆర్భాటంతోనే సరిపెట్టారు తప్ప భవన నిర్మాణాలను పునాదుల దశ కూడా దాటించలేకపోయారు. దీంతో విద్యార్థులకు తుపాను భవనంలో తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.
దేశంలోనే మూడోది అంటూ డబ్బాలు: దేశంలో ఇప్పటివరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే ఆక్వా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నరసాపురంలో ఏర్పాటు చేస్తున్నది మూడోది అంటూ ప్రచారంతో సీఎం జగన్ ఊదరగొట్టారు. ఏడాది దాటినా యూనివర్సిటీ నిర్మాణ పనులకు అతీగతీ లేదు. దీని ఏర్పాటుకు నరసాపురం పరిధిలోని సరిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని సేకరించారు. 332 కోట్ల రూపాయలతో డీపీఆర్ ఆమోదించారు.
ఆంధ్ర వర్సిటీలో యథేచ్చగా గంజాయి అమ్మకాలు.. ముగ్గురు అరెస్ట్
ఏడాది దాటినా ఎక్కడిది అక్కడే : మొదటి దశలో పరిపాలన, విద్యార్థులకు వసతి గృహాలు, విశ్వవిద్యాలయ భవన నిర్మాణాలకు 100 కోట్లు మంజూరు చేశారు. గత బడ్జెట్లో 40 కోట్లు కేటాయించినట్లు ప్రచారం చేశారు. ఇదంతా జరిగి ఏడాది గడిచినా ఇప్పటి వరకు నిర్మాణ పనులు పట్టాలెక్కలేదు. తాత్కాలిక రహదారుల నిర్మాణం తప్ప ఇంకేం చేయలేదు. ఇప్పటి వరకు చేసిన వాటికి కోటి రూపాయలు మాత్రమే అందడంతో గుత్తేదారులు చేతులెత్తేశారు. దీంతో పనులు పునాది దశ కూడా దాటలేదు.
తుపాను రక్షణ భవనాలే తరగతి గదులు : విశ్వవిద్యాలయంలో ఫిషరీస్ డిప్లొమా, బీఎఫ్‌ఎస్‌సీ, ఎంఎఫ్‌ఎస్‌సీ, పీహెచ్‌డీ కోర్సులు నిర్వహించాల్సి ఉంది. శరవేగంగా విశ్వవిద్యాలయ నిర్మాణం పూర్తి చేస్తామని సాక్షాత్తు సీఎం ప్రకటించడంతో వెంటనే ప్రవేశాలు పూర్తిచేశారు. తీరా చూస్తే భవనాలు లేకపోవడంతో లక్ష్మణేశ్వరంలోని తుపాను రక్షిత భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు.
బిల్లుల చెల్లింపులో సన్నిహితులకే ప్రాధాన్యం - జగన్ సర్కార్ తీరుతో ఆందోళనలో కాంట్రాక్టర్లు
కోట్ల రూ. నిధులు విడుదల చేశామన్నారు తీరా చూస్తే : తుపాను రక్షిత భవనంలో పూర్తిస్థాయిలో పరిశోధనలు, తరగతులు నిర్వహించేందుకు అవకాశం లేక విద్యార్థులు, అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు. శంకుస్థాపన సమయంలోనే దాదాపు 150 కోట్లు మంజూరు చేసినట్లు వైఎస్సార్సీపీ సర్కారు ప్రకటన చేసింది. కానీ, క్షేత్రస్థాయిలో కోటి విలువైన పనులూ జరగలేదు.
అరచేతిలో వైకుంఠం చూపెట్టారు : ఆక్వా విశ్వవిద్యాలయం శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు ప్రస్తుత పరిస్థితికి పొంతనే లేదు. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఏడాదికి 5 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కొత్త కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ఊదరగొట్టారు.
బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు చేతులేత్తేశారు : త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కళాశాల నిర్మాణం పూర్తి చేయడం సంగతి పక్కనపెడితే కనీసం పనులు ప్రారంభం కావడమే గగనంగా ఉంది. ప్రధానంగా నిధులు కేటాయించకపోవడం, గుత్తేదారులకు బిల్లుల చెల్లించకపోవడం వల్లే పనులు పడకేశాయి.
chandra babu:'కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం'