పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు... వ్యవసాయం ఆధారంగా జీవించే చిరంజీవికి రక్తదానం చేయటం అలవాటుగా మారింది. 35ఏళ్ల క్రితం బంధువులకు అవసరమైతే రక్తాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ.. చిరంజీవి 87సార్లు రక్తదానం చేశారు. ఆయనతో పాటు భార్య పద్మావతి సైతం రక్తదానం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. చిరంజీవి దంపతులతో పాటు వారి ముగ్గురు అబ్బాయిలు సైతం 30సార్లు రక్తదానం చేశారు. కుటుంబ సభ్యులంతా మూడునెలలకు ఓసారి రక్తదానం చేయడం పరిపాటిగా మార్చుకున్నారు.
ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఎవరికి రక్తం అవసరమైనా.. చిరంజీవికే ఫోన్ చేస్తారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరు అందుబాటులో ఉన్నా వారు సకాలంలో రక్తం ఇస్తారు. విజయవాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో రక్తం అవసరం ఉందని ఫోన్ వచ్చినా.. వెంటనే బయలుదేరివెళతారు. రక్తదానం వల్ల మరింత ఆరోగ్యంగా ఉన్నామని.. చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.
చిరంజీవి రక్తదాన సేవాగుణానికి మెచ్చిన అనేక ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు అవార్డులు అందించి ప్రోత్సహించాయి. గవర్నర్ చేతుల మీదుగా ఆయన అవార్డులు అందుకున్నారు. మరో 13 సార్లు రక్తదానం చేసి... వందసార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా గిన్నీస్ రికార్డు సాధిస్తానని చిరంజీవి ఉత్సాహంగా చెబుతున్నారు.