విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలసకు చెందిన ఉంగట్ల శంకర్రావుది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి అతనికి ఎలక్ట్రికల్ వస్తువులపై ఉన్న ఆసక్తితో ఐటీఐ పూర్తి చేశారు. తక్కువ ఖర్చుతో పర్యావరణహితంగా ఉండేలా ఏదైనా తయారుచేయాలని(YOUNG INNOVATER) సంకల్పించిన శంకర్రావు.. పాత ఇనుము, పనికిరాని వస్తువులను వినియోగించి బ్యాటరీతో నడిచే వాహనాలు, యంత్రాలు రూపొందించారు. ఓ గ్యారేజ్ నుంచి పాత టైర్లు, ఇంజిన్ సేకరించి, చుట్టూ పాత జింకు రేకులను ఏర్పాటు చేసి కారు రూపాన్ని తీసుకొచ్చారు. నలుగురు కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచేలా రూపొందించిన ఈ కారును గంటపాటు ఛార్జ్ చేస్తే.. 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
''వ్యర్థాలను వినియోగించి రూ. 50 వేల ఖర్చుతో కారు, రూ. 15 వేల ఖర్చుతో సైకిల్ తయారు చేశా. రెండు గంటల ఛార్జ్‌తో 30-40 కిలో మీటర్లు ప్రయాణం. కారుకు అవసరానుగుణంగా సోలార్ సిస్ట్మ్ అనుసంధానించుకోవచ్చు.'' - శంకర్రావు, ఆవిష్కర్త
పాత సైకిల్‌కు బ్యాటరీ, మోటారు అమర్చి.. వేగం నియంత్రించుకునేందుకు హార్స్ పవర్ కలిగిన యంత్రాన్ని బిగించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో.. 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. కేవలం రూ. 500 లతో మంకీ గన్‌ను తయారుచేశారు. శంకర్రావు ఇంటి నిర్మాణ సమయంలో కూలీల కొరత ఏర్పడటంతో.. లిఫ్ట్‌ను తయారు చేశారు. నిచ్చెనలా అల్యూమినియం ట్రాక్‌ను ఏర్పాటు చేసి.. దానికి మోటారు అమర్చారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ యంత్రం.. కింద తట్టలో ఇసుక, సిమెంట్ వేస్తే తాడుతో పైకి తీసుకొస్తుంది. ఇందుకు ఇద్దరు వ్యక్తులు ఉంటే సరిపోతుందని శంకర్రావు చెబుతున్నారు.
తనకు ఆర్థిక సహకారం అందిస్తే.. రైతులకు ఉపయోగపడేలా యంత్రాలు తయారుచేస్తానని శంకర్రావు చెబుతున్నారు.
ఇదీ చదవండి: