ఒకప్పుడు మౌలిక సదుపాయాల కొరతతో అరకొర సేవలందించే ప్రభుత్వ ఆస్పత్రులు నేడు.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో సదుపాయాలు మెరుగుపర్చుకుంటున్న ప్రభుత్వ ఆస్పత్రులు... సేవల్లోనూ మేటిగా నిలుస్తున్నాయి. వైద్య సేవలతో పాటు ఆస్పత్రుల నిర్వహణపై దృష్టిసారించేలా ప్రోత్సహించేందుకు కేంద్రం కాయకల్ప పురస్కారాలను ప్రవేశపెట్టింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్న ఆస్పత్రులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తుంది.
విజయనగరం జిల్లాలోని పలు వైద్యశాలలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందించే పురస్కారాలకు పోటీపడుతున్నాయి. ఈ ఏడాది.. సామాజిక ఆరోగ్య కేంద్రాల విభాగంలో శృంగవరపుకోట సీహెచ్సీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి స్వచ్ఛభారత్ మిషన్లో.. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే కాయకల్ప అవార్డును దక్కించుకుంది. ఇప్పటికే మూడుసార్లు ఈ అవార్డును విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రి అందుకుంది. తాజాగా నాలుగోసారి ఎంపిక కావటంపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురస్కారం కింద ఆస్పత్రికి కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షలు నగదు బహుమతి అందజేస్తుంది.
ఎస్.కోట సీహెచ్సీ సేవలు..
50 పడకల సామర్థ్యం ఉన్న శృంగవరపు కోట సామాజిక ఆరోగ్య కేంద్రం..గతంలో అరకొరగా సేవలందించేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయం, వైద్యుల పట్టుదలతో...ఆరోగ్య కేంద్రం రూపరేఖలు మారాయి. కాయకల్ప అవార్డు ప్రభావం కూడా ఆస్పపత్రి నిర్వహణపై పడింది. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, ఇతర మౌలికాంశాలు మెరుగుపరుచుకున్న శృంగవరపు కోట సామాజిక వైద్యశాల మొదటి నుంచి అవార్డుకు పోటీ పడింది.
ఎస్.కోట సీహెచ్సీలో అందిస్తున్న వైద్యసేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్ కాయకల్ప అవార్డును అందజేసింది. వరుసగా నాల్గోసారి ఎస్.కోట ఈ అవార్డును దక్కించుకుంది. 2019-20 ఏడాదికి ఎస్.కోట సీహెచ్సీ జిల్లా స్థాయిలో ఉత్తమ ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. 2016-17లో జిల్లాలో రెండో స్థానం, 2017-18లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం, 2018-19లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అవార్డు ద్వారా ఆసుపత్రికి రూ.5 లక్షల ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని వైద్యులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాయకల్ప అవార్డు సాధించే క్రమంలో వైద్యశాలలు... మెరుగైన వైద్య సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పచ్చదనంతో కనిపిస్తున్నాయి. ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనలకు వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రజలు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి : తండ్రి, కుమార్తెపై మారణాయుధాలతో దాడి!