పంచాయతీల్లో రసవత్తరంగా పోటీ సాగుతున్న వేళ... పురపోరు తెరపైకి వచ్చింది. పుర ఎన్నికలపై విజయనగరంలో తీవ్ర ఆసక్తి నెలకొంది. గతేడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో.. అక్కడినుంచి ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించినట్లు.. మున్సిపల్ కమిషనర్ ఎం.రమణమూర్తి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం... రూ.లక్షా 50 వేలకు మించి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు చేయొద్దని చెప్పారు.
మార్చి 3 తర్వాత అభ్యర్థుల జాబితా..
మున్సిపాలిటీలో 183 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. వీటిలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైందని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. మిగిలిన 182 నామినేషన్లు ఉన్నాయని... మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. మార్చి 3 తర్వాత పోటీలో అభ్యర్థుల జాబితా, గుర్తులతో సహా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
వైకాపా 87, తెదేపా 70, సీపీఎం 1, సీపీఐ 2, జనసేన 1, భాజపా 5 నామినేషన్లు దాఖలయ్యాయని ఎం.రమణమూర్తి తెలిపారు. వచ్చే నెల 4 నుంచి అభ్యర్థులు తమ ప్రచారం చేసుకోవచ్చని చెప్పారు. మున్సిపాలిటీలో మొత్తం 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలని స్పష్టం చేశారు. మార్చి 10న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. విజయనగరం పట్టణంలో 8 అతి సమస్యాత్మక, 6 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కౌన్సిలర్ అభ్యర్థి.. రూ.లక్షా 50 వేలకు మించి ఖర్చు చేయొద్దని చెప్పారు. నిబంధనలు పాటించకుంటే... అభ్యర్థుల్ని అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చించారు.