గ్రామీణ స్థాయికి పరిపాలన వ్యవస్థను తీసుకొని వెళ్ళాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. ఎంపికైన ఉద్యోగులందరూ ఉన్నత చదువులు చదివి, చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉంటూ ముఖ్యమంత్రి చొరవతో ఇటీవలనే ప్రభుత్వం ఉద్యోగులుగా నియమింపబడ్డారన్నారు. వీరి నియామకాలతో గ్రామ స్థాయిలో పరిపాలన సులభతరం అయ్యిందన్నారు. ప్రజలకు కార్యాలయాలు చుట్టూ తిరిగే అవసరాలు తగ్గాయని, మహిళలు, వృద్ధులకు ఇంటి వద్దనే ఉంటూ వీరి సేవలను పొందుతూ, సంరక్షింప బడుతున్నారన్నారు.
అటువంటి, సచివాలయ ఉద్యోగుల పట్ల అవగాహన లేని కొంతమంది వ్యక్తులు దురుసుగా ప్రవర్తించడం, విధులు నిర్వర్తించకుండా అడ్డుపడడం, నిష్కారణంగా దూషణలకు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఇటీవలనే తన దృష్టికి వచ్చిందన్నారు. సచివాలయ ఉద్యోగుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, దూషణలకు, బెదిరింపులకు పాల్పడినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మహిళ ఉద్యోగులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైనా ఉందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, పోలీసుల సహాయం కోసం పోలీసు వాట్సాప్ నంబరు 6309898989 కు లేదా డయల్ 100 కు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.
సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ వుమెన్ ఎట్ వర్కు ప్లేస్ చట్టం, 2013 ప్రకారం ప్రతీ మండల స్థాయి కార్యాలయంలోనూ మరియు వారు విధులు నిర్వహించే ప్రాంతాల్లో10 మంది కంటే ఎక్కువ మహిళలు అక్కడ పని చేస్తున్నట్లయితే వారిపై జరిగే లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అలా కమిటీలు లేనిచోట జిల్లా స్థాయిలో లోకల్ కంప్లయింట్ కమిటీకి వారి సమస్యలను నేరుగా ఫిర్యాదు చేస్తే.. విచారణ చేపట్టి, వారి సమస్యలను పరిష్కరిస్తుందని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.
ఇదీ చదవండి: ఏపీ: మరో 10, 392 మందికి కరోనా... 4,55,531కు పెరిగిన బాధితులు