విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సాగుకు సిద్ధమైన అన్నదాతలపై ‘సూక్ష్మ’ భారం పడుతోంది. సూక్ష్మపోషకాలపై రాయితీ ఎత్తివేయడంతో పూర్తిధరను చెల్లించి వీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో చాలా మంది కర్షకులు భారంగా భావించి వీటి వినియోగానికి దూరమవుతున్నారు. ఫలితంగా భూసారంతో పాటు పంట దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టపోయే అవకాశం ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.
- ఫలితాల్లేవు..పోషకాలు అందవు..
ఖరీఫ్‌లో జిల్లా మొత్తం మీద అన్ని రకాల పంటలు కలిపి 1,81,811 హెక్టార్లలో సాగవుతున్నాయి. సాగుకు ముందే మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేసి ఫలితాలను రైతులకు తెలియజేయాల్సి ఉన్నా ఇదేదీ ఈ సారి జిల్లాలో జరగలేదు. జిల్లాలో 108 మంది వరకు మాత్రమే నేరుగా మట్టినమూనాలను భూసార పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లి ఫలితాలను తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల్లోని మినీ ల్యాబ్‌ల్లో ఇంత వరకు 65 మంది మాత్రమే ఈ పరీక్షలు చేయించుకున్నారు. భూసార పరీక్షల కార్డులు పొందిన రైతులు వాటి ఫలితాలకు అనుగుణంగా సూక్ష్మపోషకాలను వినియోగించాలి. కానీ చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేదు. ఈ ఖరీఫ్‌లో రైతులకు భూసార ఫలితాలతో పాటు సూక్ష్మపోషకాలు అందక వారి పరిస్థితి అగమ్యగోచరంలో పడింది.
- అన్నదాతలపై భారం ఇలా ...
భూసారంతో పంట దిగుబడులు పెంచుకోవడానికి జింకు, బోరాన్, జిప్సం వంటి సూక్ష్మపోషకాలు అవసరం ఎంతో ఉంది. వీటిని 2018 ఖరీఫ్‌లో రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. 2019 రబీ నుంచి 50 శాతం రాయితీపై పంపిణీ చేయగా ప్రస్తుత ఖరీఫ్‌లో రాయితీని ఎత్తివేసింది. పూర్తిధరను చెల్లించి సూక్ష్మపోషకాలను పొందవచ్చని చెబుతున్నారు. జిల్లాలో రైతులకు ఖరీఫ్‌లో సుమారు 1400 టన్నులకు పైగానే సూక్ష్మపోషకాలు అవసరం. వీటిని పూర్తిధరకు కొనుగోలు చేయాలంటే వారికి ఆర్థిక భారమే. ప్రస్తుతం మార్కెట్లో టన్ను జింకు ధర రూ.53,200 పలుకుతుండగా జిప్సమ్ రూ.2,827, బోరాన్ రూ.97 వేలు ఉంది. జిల్లాలో సూక్ష్మపోషకాలకు మొత్తం రూ.2 కోట్లకు పైగానే రైతులు భరించాల్సి వస్తోంది.
- పోషకాలు లోపిస్తే...
జింకు.. మొక్కల ఎదుగుదలకు ఉపకరిస్తోంది. ఇది లోపిస్తే ఆకుల ఈనెల భాగం పసుపు రంగులోకి మారి చిన్నవి అవుతాయి.
బోరాన్ పూత దశలో కీలకంగా పనిచేస్తుంది. ఆకుల్లో తయారయ్యే ఆహారాన్ని ఇది అన్ని భాగాలకు చేరుస్తోంది.
జిప్సంలో కాల్షియం, గంధకం ధాతువులుంటాయి. చౌడు భూముల్లో సోడియం తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతోంది.
- పూర్తిధర చెల్లించాలి
సూక్ష్మపోషకాలు అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్‌ల ద్వారా వివరాలు పంపాలి. పూర్తిధరను చెల్లించాలి. గతంలో వీటిపై ఇచ్చిన రాయితీలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. రైతులకు అవసరమైన సూక్ష్మపోషకాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా పొందవచ్చు.- ఆశాదేవి, సంయుక్త సంచాకులు, వ్యవసాయశాఖ
- బయట కొనుగోలు చేయలేదు
గతంలో వరి సాగుకు ముందే సూక్ష్మపోషకాలను ఉచితంగా ఇచ్చేవారు. ఈ సారి బయట కొనుగోలు చేయాలంటున్నారు. పెట్టుబడి ఖర్చులు భారమై బయట కొనలేదు. వరినారు ఆకులు రంగుమారి పోతున్నాయి -బి.ఆదినారాయణ, రైతు గుర్ల
- భూసార ఫలితాల్లేవు
ఖరీఫ్‌లో భూసార ఫలితాలేవీ ఇవ్వలేదు. ఏ పోషకాల లోపం, వాటి భర్తీకి ఎరువుల వాడకం గురించి ఎవరూ తెలియపరచలేదు. మాకు తెలిసిన విధానంలోనే ఎరువులు వాడుతున్నాం. సూక్ష్మపోషకాలపై రాయితీ లేకపోవడంతో బయట కొనడం మానేశాం. - ఎం.ఈశ్వరరావు, పోరలి, దత్తిరాజేరు మండలం
గుజ్జింగవలస గ్రామంలోని ఒక రైతు పొలంలో వరినాట్లు వేసిన కొద్ది రోజులకే ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతోంది. అవి పెళుసు కట్టి వంచగానే విరిగి పోతున్నాయి. ఈ లక్షణాలకు కారణం పొలంలో జింకు లోపమేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
గుర్లలో ఒక రైతు సాగుచేసిన వరినారు మడిలో లేత చిగురాకులు తెల్లగా మారుతున్నాయి. ఎరువులు వేసినప్పటికీ పచ్చబడడం లేదు. ఇనుముధాతువు లోపంతోనే ఇలాంటి లక్షణాలకు అవకాశం ఉంటుందని వ్యవసాయ సిబ్బంది అంటున్నారు.
ఇదీ చదవండి :