UTF Protest: విజయనగరంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన ర్యాలీ చేపట్టారు. యూటీఎఫ్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లారు. సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.ప్రసాద్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈనెల 31లోగా సీపీఎస్ రద్దు విధివిధానాలు ప్రకటించకపోతే ఏప్రిల్ 3న తిరుపతిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. తిరుపతి సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు.
సీపీఎస్ రద్దు విధానంలో ఒక్క అడుగు ముందుకు పడలేదని, ఇప్పటి వరకు జరిగిన నాలుగు బడ్జెట్ సమావేశాల్లోనూ సీపీఎస్ పథకంపై సీఎం ఒక్క మాటా మాట్లాడకపోవటం శోచనీయమని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం శాసనమండలిలో వాయిదా తీర్మానాన్ని కోరుతున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సీపీఎస్ రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: అగ్గిపెట్టెల లారీ దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్