విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడలోని ఉప్పు తయారీ కేంద్రమిది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 200 ఎకరాల వరకు ఉప్పు గల్లీ భూములు ఉన్నాయి. గతంలో ఏటా జనవరి నుంచి మే నెలాఖరు వరకు ఇక్కడ అత్యధికంగా వేర్వేరుచోట్ల లవణం తయారీ చేసేవారు. గతంలో ఏటా 5వేల టన్నులకుపైగా ఉప్పు ఉత్పత్తి అయ్యేది. స్థానికంగా రోజూ 100 మందికి ఉపాధి లభించేది. ఇక్కడ తయారైన ఉప్పు ఉత్తరాంధ్రలోని తీరప్రాంతాల్లో మత్స్యకారులు ఉప్పు చేపల తయారీకి విరివిగా ఉపయోగించేవారు. శ్రీకాకుళం జిల్లాలోని పరిశ్రమలకు, ఒడిశాకు ఎగుమతయ్యేది.
బోసిపోయిన ఉప్పు గల్లీ భూములు
ఇప్పుడు ఉప్పు సాగు భూములన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కనీసం ఒక్క ఎకరాలోనూ ఉప్పు గల్లీలేదు. పలు సమస్యలతో ఉప్పు తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం పూర్తిగా కళతప్పింది. స్థానికంగా పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు.
ఉత్పత్తి నిలిచిపోవడానికి కారణాలు
కోనాడలో ఉప్పు ఉత్పత్తి నిలిచిపోవడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి 2018 నాటికి గల్లీల లీజుల సమయం పూర్తైంది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ పునరుద్ధరించలేదు. భూముల శాశ్వత లీజుదారులు ప్రభుత్వానికి ఏడాదికి ఎకరాకు 400 నుంచి 500 రూపాయలు చెల్లిస్తున్నారు . వారు మాత్రం సబ్‌లీజుదారులకు ఎక్కువ డబ్బుకు లీజుకు ఇస్తున్నారు. ఫలితంగా సాగుదారులు ఉప్పు తయారీ గిట్టుబాటు కాక పూర్తిగా దూరమయ్యారు. ఉప్పు సాగుకు సముద్రం నీరు వచ్చే గెడ్డ పక్కన పెద్దఎత్తున రొయ్యల చెరువులు ఏర్పాటు చేశారు. ఈ నీటిని రొయ్యల రైతులు తోడేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉప్పు కయ్యలకు సముద్రపు నీరు అందటం కష్టతరమవుతోంది. రాబోయే సీజన్‌కు అయినా భూముల లీజు వ్యవహారాన్ని పరిష్కరించాలని సాగుదార్లతోపాటు కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.