Police Mock Drill In Ongole RTC Bus Depot : ఒంగోలు బస్టాండ్ నిత్యం రద్దీగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అక్కడికి వస్తారు. ఎక్కాల్సిన బస్సు రాగానే సీట్ల కోసం కొందరు హైరానా పడుతుంటారు. గమ్యస్థానం రావడంతో మరికొందరు బస్సుల నుంచి దిగుతూ గాబరా పడతుంటారు. ఇలా బస్టాండ్ అంతా ఎప్పుడూ రద్దీగానే ఉంది. శాంతి భద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహ చర్యలను నిర్వీర్యం చేయడం, పౌరుల్లో భద్రతా భావాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా ఒంగోలులోని ఆర్టీసీ డిపోలో బుధవారం డెమో డ్రిల్ (Mock Drill) చేపట్టారు. ఎస్పీ ఏఆర్. దామోదర్ ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఇందులో భాగంగా పరుగు పరుగున పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడకు వచ్చారు. జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక పరికరాలతో వెతుకులాట ప్రారంభించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ సంచిని స్వాధీనం చేసుకుని అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించి బయటికి తీశారు. అనంతరం ప్రత్యేక సూట్ ధరించిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బ్యాగ్ నుంచి పేలుడు పదార్థాలను అత్యంత జాగ్రత్తగా బయటికి తీశారు. తీగలు కత్తిరించి పేలకుండా నిర్వీర్యం చేశారు.
అనంతరం పోలీసు అధికారులు మాట్లాడుతూ ఏమైనా అనుమానాస్పద బ్యాగులు, ఇతర వస్తువులు కనిపించినా, అనుమానిత వ్యక్తుల సంచారం తెలిసినా స్థానిక పోలీసులు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. డెమోను ఏఎస్పీ అశోక్‌బాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ నాగరాజు, ఎస్సై త్యాగరాజు తదితరులు పర్యవేక్షించారు.
'అత్యవసర పరిస్దితుల్లో ప్రజలు సమయమనం పాటించి పోలీసు వారికి సహకరించాలి. ఆపత్కర పరిస్థితుల్లో పోలీసు శాఖ తీసుకునే చర్యలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాం. ఇటువంటి వాటిని సమర్దంగా ఎదుర్కోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ప్రజలు కూడా అత్యవసర పరిస్దితుల్లో ఆందోళనకు గురికాకుండా పోలీసు శాఖ సూచనలను పాటించి వారికి సహకరించాలి.' - రాయపాటి శ్రీనివాస్, డీఎస్పీ, ఒంగోలు