JEE Main Exam Started : ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన పరీక్షలు 23, 24, 28, 29, 30 తేదీల్లో విడతల వారీగా నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 22 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. భారత విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుపుతున్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించే బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించారు.
పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్షల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులను పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకుంటున్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డు, హాల్ టికెట్ పై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేసిన ఫొటోలు ఉన్న వారినే లోనికి పంపుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, బంగారు, వెండి గొలుసులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. పరీక్షా కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పరీక్ష కేంద్రాలకు విద్యార్థుల వెళ్లడంతో హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్‌బీనగర్‌లో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కలిగింది.
చివరి రోజు 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 జరుగుతుంది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతున్నారు.
లద్దాఖ్‌లో పేపర్-1, వైజాగ్‌లో పేపర్-2- విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఎన్టీఏ
జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై యుటర్న్! 15 రోజుల్లోనే ఆ నిర్ణయం మార్పు- ఇకనుంచి ఎన్నిసార్లు రాయొచ్చంటే!