రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో ముగ్గరు యువకులు దుర్మరణం చెందారు. కొత్తవలస మండలం దేశుపాత్రునిపాలెం వద్ద ప్రమాదం జరిగింది. యువకులు పెందుర్తి నుంచి కొత్తవలస వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లాలో ముగ్గురు..
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పెద్దకడబూరు మండలం బసలదొడ్డి వద్ద ప్రమాదం జరిగింది. మృతులు చిన్నతుంబళం గ్రామస్థులుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మూడు కార్లు ఢీ- పలువురికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు వద్ద జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మద్దిపాడుకు చెందిన షేక్ అన్వర్.. మరో ముగ్గురితో కలిసి సినిమా చూసేందుకు కారులో ఒంగోలు వెళ్తున్నారు. ఏడుగుండ్లపాడు వద్దకు రాగానే వాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కన వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఈ రెండు కార్లు... వ్యతిరేక దిశలో వెళ్తున్న మరో కారును ఢీకొట్టాయి.
ఇలా.. నిమిషాల వ్యవధిలో మొత్తం మూడు కార్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో కర్నూలు జిల్లా జమ్మలమడుగుకు చెందిన ప్రశాంత్ కుమార్, రహీం, వినయ్, గుజరాత్‌కు చెందిన శివతోపాటు పలువురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై శ్రీరామ్.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు.
ఇదీ చదవండి: లోయలో పడిన బస్సు- 14 మంది దుర్మరణం