విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గుణి దాం గ్రామానికి చెందిన తమ్మిన కృష్ణారావు అనే రైతు తనకున్న రెండు ఎకరాల్లో గుమ్మడి పంటను పండిస్తున్నారు. తనకున్న రెండు ఎకరాల్లో ముందుగా బొప్పాయి పంట వేసుకున్నారు. వేసుకున్న బొప్పాయి పంటకు వైరస్ ఆశించి పెట్టుబడి మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని ఆలోచించి.. బొప్పాయిలో అంతర పంటగా గుమ్మడి సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నట్లు కృష్ణారావు చెప్పుకొచ్చారు. ఈటీవీలో ప్రసారమయ్యే జైకిసాన్లో చూసి అంతర పంటగా గుమ్మడి సాగు చేసినట్లు ఆయన వెల్లడించారు.
గుణి దాం గ్రామంలో తమ్మినేని కృష్ణారావు అనే రైతు తనకున్న రెండెకరాల బొప్పాయి తోటలో అంతర పంటగా గుమ్మడి సాగు ప్రారంభించారు. సాగుకు సంబంధించి తనకున్న పరిజ్ఞానంతో సాటి రైతుల సలహాలు సూచనలు తీసుకుని ఒడిశా నుంచి సుమారు రెండు ఎకరాలకు సరిపడా బరంపురం పరదేశి విత్తనాలను ఒక కిలో రూ. 3000 రూపాయలు ఇచ్చి తెప్పించుకున్నారు. విత్తనాలు నాటుతున్న సమయంలో మన గ్రోమోర్ షాప్ నుంచి మెగా పవర్, సల్ఫర్లను కలిపి విత్తనాలు పొడిచే గుంతలో కొద్దికొద్దిగా అంచనా వేసుకొని విత్తనాలు నాటారు. ప్రతి పది రోజుల నుంచి 15 రోజుల మధ్యలో డ్రిప్ సహాయంతో నీరు పెట్టుకుని పంటను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. తర్వాత 25 రోజుల తర్వాత మరొక్కసారి మెగా పవర్, సల్ఫర్ రెండు ఎకరాలకు అందిచారు. దీంతో పంట ఏపుగా పెరిగిందని ఆయన అన్నారు. పంట విత్తిన రెండు నెలలకే రెండు సార్లు పంటను కోసి అమ్మడం జరిగిందని రైతు చెప్పారు. ఇప్పటివరకు ఎటువంటి మందులు పిచికారి గాని జరగలేదని రైతు కృష్ణారావు తెలుపుతున్నారు.
ఒడిశా నుంచి వర్తకులు వస్తున్నారు..
బొప్పాయిలో అంతర పంటగా వేసిన గుమ్మడికాయ పంట సాగుకోసం విత్తనాలకు, విత్తనాలు నాటేందుకు కూలీలకు, రెండు ఎకరాలకు వేసే 100 కిలోల ఎరువులకు ఖర్చు తప్పా రైతుకు ఇంక ఎటువంటి క్రిమిసంహారక మందులు గాని.. కలుపు తీసే పని గాని.. ఎరువులు వేసే బెడద గాని లేదని అన్నారు. వర్తకులు బరంపురం,ఒడిశా నుంచి నేరుగా రైతుల పంటపొలాల వద్దకు కూలీలతో వచ్చి లారీతో తూకం వేసే వరకు వాళ్లే చూసుకుంటున్నారని తెలిపారు. తూనిక వేసిన వెంటనే నేరుగా రైతు ఖాతాలోకి లేదా ఫోన్ పే ,గూగుల్ పే, ద్వారా పంట అమ్మిన సొమ్ము వెంటనే రైతు ఖాతాలో జమ చేస్తున్నారని అన్నారు. డబ్బులకు తిరగకుండా.. ఇది చాలా ఆనందకరమైన విషయమని తెలిపారు. మిగతా అంతర పంటలతో పోల్చితే విత్తు నాటిన నుంచి..పంట అమ్ముకునే వరకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. గుమ్మడి పంటతో రైతు లాభాలు గడించవచ్చని రైతు కృష్ణారావు పేర్కొన్నారు. చీపురుపల్లి మెరకముడిదాం గుర్ల గరివిడి లావేరు మండలం తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతున్నారని.. మొక్కజొన్న పంటతో పోల్చుకుంటే పెట్టుబడి చాలా తక్కువని అన్నారు. గుమ్మడి సాగుపై ఎవరికైనా సలహాలు సందేహాలు ఉంటే తమ గ్రామం వచ్చి తెలుసుకోవాలని కృష్ణారావు తెలిపారు.
ఇదీ చదవండి: మండుతున్న పూల ధరలు.. అయినా రైతుకు అందని లాభాలు