ఆమె పేరు అన్నపూర్ణ. సాదాసీదా ఉద్యోగం. కానీ ఆమె అందించే సేవలు మాత్రం పరిపూర్ణం.. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణీ. అయినా కరోనాపై పోరుకు ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు. ఎక్కడా.. అధైర్యపడకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. కరోనాను జయిద్దాం.. అంటూ అందరిలోనూ స్ఫూర్తి నింపుతోంది.
అన్నపూర్ణ.. ప్రస్తుతం విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, రావాడ రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా సేవలందిస్తోంది. వృత్తిపై నిబద్ధత కనబరుస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోంది. రోజూ ఉదయమే కార్యాలయానికి రావడం.. తనకు అప్పగించిన పని చేయటం.. ఇదే ఆమె జీవితం. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ రోగులతో పాటు కరోనా రోగులకు కూడా సేవలందిస్తోంది. అంతే కాదు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా పాల్గొని వచ్చిన వారికి టీకా వేస్తోంది. అయిన వాళ్లే భయపడుతున్న కరోనా రోజుల్లో.. కడుపులో బిడ్డను పెట్టుకుని.. ఇలా సేవలందించడం ప్రశంసనీయం.
వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెప్పినా..
అన్నపూర్ణ గర్భిణీ కావటంతో వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. మిగతా వారు చూసుకుంటారు కదా రిస్క్ వద్దని సూచించారు. అయినా ఇప్పడు కాకపోతే.. మరింకెప్పుడు సాయపడతామని అన్నపూర్ణ నిర్ణయించుకొంది. రోగులను తన సొంత మనుషుల వలే చూసుకుంటూ సేవలందిస్తోంది. కరోనా టెస్టుల నిమిత్తం శాంపిల్స్ కలెక్ట్ చేయటం.. వ్యాక్సిన్ వేయటం వంటి పనుల్లోనూ భాగస్వామ్యమవుతూ మిగిలిన వారిలో స్ఫూర్తి నింపుతోంది. అన్నపూర్ణ అందించే సేవలతో మాపై కొంత పనిభారం తగ్గుతోందని తోటి ఉద్యోగులూ చెబుతున్నారు.
సేవ చేయటంలోనే ఆనందం
వివిధ రోగాలతో ఆసుపత్రులకు వచ్చే వారికి సేవలందించటంలో ఏదో తెలియని ఆనందం ఉంటుంది. మనమందించే సాయం వారికి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. వాళ్లతో ఆత్మీయంగా మాట్లాడితే చాలా సంతోషిస్తారు. అప్పుడప్పడు ఇబ్బందులున్నా.. కరోనా లాంటి సమయంలో కూడా సేవలందిస్తున్నందుకు లోలోపల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంటిలో వాళ్లు, తోటి ఉద్యోగులు నాకు అండగా ఉండటంతోనే ఇదంతా సాధ్యపడింది. మా ఉన్నతాధికారులు ఎప్పడూ ధైర్యం చెబుతూ నా పనిలో సాయపడతారు. నాకు అండగా నిలుస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు.
- ఏ. అన్నపూర్ణ, ఏఎన్ఎం, రావాడ రామభద్రపురం పీహెచ్‌సీ
ఆమె సేవలు అభినందనీయం
ఈ కరోనా సమయంలో ఆమె స్వచ్ఛందగా చేస్తున్న సేవలు అభినందనీయం. ఉన్నతాధికారులు, మేం ఈ కరోనా సమయంలో గర్భిణులకు విధుల నుంచి మినహాయింపు ఇచ్చాం. అయినా ఆమె ఆసుపత్రికి వస్తూ.. ఎంతో ధైర్యంగా రోగులకు సేవలందిస్తోంది.
- శ్రావణ్ కుమార్, వైద్యులు , రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
ఇదీ చదవండి: అవాంతరాల నడుమ పావని అంత్యక్రియలు పూర్తి