Police Serve Notices To Sugar Cane Farmers: చెరకు బకాయిలు చెల్లించాలని ఆందోళన చేసిన రైతులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం పరిధిలోని సుమారు 2,400 మంది రైతులకు రూ.16.33 కోట్ల బకాయిలను యాజమాన్యం చెల్లించాలి. ఈ క్రమంలో వారు నవంబరు 3న 36వ రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. రైతుల అరెస్టుకు పోలీసులు సిద్ధమవుతుండగా, ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయని అదేరోజు 22 మంది రైతు నాయకులు, రైతులపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ అధికారులపై కర్రలతో దాడి, గుంపులుగా ఆందోళన, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన, కొవిడ్ సమయంలో గుమిగూడటం వంటి కారణాలను చూపుతూ పోలీసులు నోటీసులిస్తున్నారు. వీడియో దృశ్యాల ఆధారంగా రైతులను గుర్తిస్తున్నారు. నవంబరు 29న నోటీసులు సిద్ధం చేశారు. బొబ్బిలి గ్రామీణ సీఐ శోభన్‌బాబు ఎదుట హాజరవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. బొబ్బిలి, సీతానగరం మండలాల పరిధిలో 80 మందికి నోటీసులిచ్చినట్లు సమాచారం. బకాయిల కోసం అడిగితే నోటీసులివ్వడమేమిటని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వేలం వేసినా..
రైతుల ఆందోళన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు పంచదార నిల్వల్లో 34,672 క్వింటాళ్లకు నవంబరు 23న అధికారులు వేలం నిర్వహించారు. చెన్నైకి చెందిన వ్యాపారి రూ.11.54 కోట్లకు దక్కించుకొని అదేరోజు పది శాతం ధరావతు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని పది రోజుల్లో చెల్లించి సరకు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. లోగడే తాము ఎన్‌సీఎస్ యాజమాన్యం నుంచి ఈ పంచదార కొనుక్కున్నామని టాటా కన్సల్టెన్సీ ప్రతినిధులు ఆ వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నెలాఖరువరకు న్యాయస్థానం స్టేటస్‌కో విధించిందని అధికారులు తెలిపారు. దీంతో చెల్లింపుల అంశం కొలిక్కిరాలేదు.
ఇదీ చదవండి
Remond: చెరుకు రైతుల ఆందోళనలో అరెస్టైన నేతలకు 14 రోజుల రిమాండ్