విజయనగరం జిల్లా సారికలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన పవన్ కుమార్ ఆదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
గ్రామానికి చెందిన లతకు పవన్ కుమార్ అనే కుమారుడు, తొమ్మిదో తరగతి చదవుతున్న కుమార్తె ఉన్నారు. మే 5వ తేదీన పాల ప్యాకెట్లు తీసుకురావడానికి ద్విచక్రవాహనంపై వెళ్లిన తన కుమారుడు తిరిగి రాలేదని లత.. విజయనగరం పోలీసులను అశ్రయించింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూలై 27న సారిక దగ్గరలోని వ్యవసాయ భూమిలో.. గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు ఆదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పవన్ కుమార్‌గా గుర్తించారు. అనంతరం పవన్ కుమార్ మృతి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పవన్ చెల్లిని గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు ప్రేమించాడు. సురేష్‌ది వేరే కులం కావటం, తన చెల్లెలుకు వివాహ వయస్సు లేకపోవటంతో వారి ప్రేమను తల్లి లత, పవన్ కుమార్ నిరాకరించారు.
తన ప్రేమను నిరాకరించటంతో ఆగ్రహం పెంచుకున్న సురేష్.. పవన్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు. మృతుడి తల్లితో వివాహేతర సంబంధం ఉన్న జగదీష్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పవన్ కుమార్ హత్యకు పథకం రచించారు. పథకం ప్రకారం పవన్ కుమార్‌ను హత్య చేశారు. అనంతరం మృతదేహం జాడ తెలియకుండా అతడి ద్విచక్రవాహనానికి కట్టి.. గ్రామ సమీప వ్యవసాయ బోరు బావిలో పడేశారని పోలీసులు తెలిపారు. మిస్టరీని చేధించిన పోలీసులకు డీఎస్పీ అనిల్ కుమార్ రివార్డులు ఇచ్చి అభినందించారు.
ఇదీ చదవండి
SUICIDE ATTEMPT: హోటల్ గదిలో గొంతు కోసుకొని.. ఇద్దరు ఆత్మహత్యాయత్నం !