స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ.. విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడలోని మైథాన్ పరిశ్రమలో వద్ద.. సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలో పారిశ్రామికవాడలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆందోళనలు చేస్తున్న మహిళల్ని అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారంటూ.. వారిని ప్రత్యేక వాహనాల్లో అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాహనాల్లో వెళ్లేందుకు వారు నిరాకరించారు. తీవ్ర ఆగ్రహంతో పోలీసులపై మట్టిచల్లారు. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో కూడా.. ఆందోళనకారులు శాంతించలేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా తరలించడం సరికాదంటూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ సహా పలువురు పోలీసు అధికారులు వారించే ప్రయత్నం చేసినా.. ఆందోళనలు ఉద్ధృతం చేశారు. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మహిళలపై దాడిని ఖండించిన నారా లోకేశ్
జగనన్న అన్నందుకు.. గన్లు పట్టుకున్న పోలీసుల్ని అక్కాచెల్లెమ్మలపైకి సీఎం పంపారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ కి వేలాది ఎకరాలు ఇచ్చిన తమను కాదని, ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పించడమేంటని.. నిరసన తెలుపుతున్న మహిళలపై పోలీసులతో లాఠీచార్జీ చేయడమేనా అక్కాచెల్లెమ్మలకు మీరిచ్చే బహుమతి అని ప్రశ్నించారు.
స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేయడం మీ దృష్టిలో నేరమైతే.. ప్రైవేట్ పరిశ్రమల్లోనూ స్థానికులకే 70 శాతం ఉద్యోగాలని జీవో తెచ్చి, అమలు చేయని మీరు ఏ1 ముద్దాయి అని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో మహిళలకు భద్రతలేదని, చివరికి ఉపాధి కోసం రోడ్డెక్కితే ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ఇదొక ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వం అని మీరెప్పుడో మరిచిపోయారని ధ్వజమెత్తారు. నిరుపేద మహిళల పట్ల ఎన్నాళ్లీ దౌర్జన్యాలు, దాడులు అని నిలదీశారు. మహిళలపై దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత మహిళలకు తెదేపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Adulterated toddy case: జీలుగు కల్లు ఘటన కేసులో నిందితుడు అరెస్టు.. అక్రమ సంబంధమే కారణం..!