ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు విజయనగరం జిల్లాలో 15 వేల గిరిజన కుటుంబాలకు 50 వేల ఎకరాల అటవీభూమిపై పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వెల్లడించారు. వనసంరక్షణ సమితుల భూములు సుమారు 27 వేల ఎకరాలు, 11,600 ఎకరాలు వ్యక్తిగత పట్టాలు, 8,250 ఎకరాల వరకు డీకేటీ భూములు కలుపుకొని 50 వేల ఎకరాలు ఆగష్టు 9వ తేదీన ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్‌తో గిరిజన సంక్షేమశాఖ డైరక్టర్ రంజిత్ భాషా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో అటవీ భూముల పట్టాల పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్‌కు వివరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి పట్టాలు సిద్ధం చేస్తామన్నారు. జిల్లాలో 21,722 ఎకరాలు పంపిణీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కాగా, లక్ష్యాన్ని మించి గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పట్టాల పంపిణీకి ఆమోదం తెలిపామన్నారు. మరి కొద్ది రోజుల్లో మరోసారి కమిటీ సమావేశం నిర్వహించి మరికొంత భూమికి పట్టాలు ఇచ్చేందుకు ఆమోదం తెలుపనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఐ.టి.డి.ఏ. ప్రాజెక్టు అధికారి డా.ఆర్.మహేష్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గ్రామ సచివాలయలకు లామినేషన్ యంత్రాలు