విజయనగరం జిల్లా బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆభరణాల తనిఖీని అధికారులు ప్రారంభించారు. బొబ్బిలి ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ నుంచి ఆలయానికి భారీ బందోబస్తు మధ్య ఆభరణాలను తరలించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త సుజయకృష్ణ రంగారావు, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు చేపట్టారు.
స్వామి వారికి ఎన్ని కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని రికార్డుల మేరకు అధికారులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వెండి ఆభరణాలు కూడా పరిశీలిస్తున్నారు. ఇటీవల బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పల నాయుడు బొబ్బిలి వేణుగోపాల ఆస్తులపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వద్ద ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు అధికారులు ఆభరణాలు లెక్కింపును ప్రారంభించారు. స్వామి వారికి నాలుగు వేల ఎకరాల భూములు ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించిన సంగతి తెలిసిందే. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని సమగ్ర సర్వే చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆభరణాల తనిఖీలు కూడా ప్రారంభించారు.
ఇదీ చదవండి: 'ఇసుకను ప్రభుత్వం విలువైన వస్తువుగా మార్చింది'