ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి విజయనగరం జిల్లాకు తరలివస్తున్న మద్యం ఏరులైపారుతోంది. దీన్ని నిరోధించడం పోలీసు, ఎస్‌ఈబీ అధికారులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పూసపాటిరేగ మండలం పోరాం గ్రామ పొలిమేరలో ఓ రేకుల షెడ్డులో నిల్వ చేసిన ఒడిశా మద్యాన్ని ఎస్‌ఈబీ సీఐ ఎంఆర్వీ అప్పారావు, ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో కలసి ఆకస్మికంగా దాడి చేసి బుధవారం స్వాధీనం చేసున్నారు. ఎలాంటి సుంకం చెల్లించని ఈ మద్యం విలువ రూ.లక్షకు పైగా ఉంటుందని సహాయ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శైలజారాణి తెలిపారు. పోరాం, అగ్రహారాలకు చెందిన కిలారి నరసింగరావు, పి.కనకారావు, జి.వెంకటరమణ, ఎం.బుచ్చిబాబు, ఎం.సీతంనాయుడును అరెస్టు చేశామని, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 15 రోజుల పాటు నిఘా ఉంచి, చాకచక్యంగా వ్యవహరించి మద్యం పట్టుకున్న ఎస్‌ఈబీ సిబ్బందిని ఆమె అభినందించారు.
ఇదీ చదవండి: కొరియా పగులుచెన్నూరులో ఉద్రిక్తత