SUDARSHAN REDDY ILLEGAL ACTIVITIES : అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓ జవహర్‌బాబుపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2023లో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్టు దక్కించుకున్న ఆయన, వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ సుదర్శన్‌రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహం అప్పట్లో చర్చనీయాంశమైంది.
చంద్రబాబు అరెస్టు సమయంలోనూ హడావుడి: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన జల్లా సుదర్శన్ రెడ్డి వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు సన్నిహితుడు. ఆయన అండతోనే గాలివీడు ఎంపీపీ పదవికి రాజీనామా చేసి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్టు దక్కించుకున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా 2023 మే లో ప్రభుత్వం జీవో జారీ చేసి సుదర్శన్ రెడ్డిని డీఓపీగా నియమించింది అప్పటి ప్రభుత్వం.
చంద్రబాబు అరెస్టు సమయంలోనూ సుదర్శన్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి, మీడియా ముందు హడావుడి చేశాడు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడ్డాక సీఐడీ ప్రత్యేక పీపీతో కలిసి మీడియా ముందుకు వచ్చిన సంఘటన న్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాంటి రాష్ట్ర స్థాయి హోదాలో పని చేసిన వ్యక్తి మండలస్థాయి అధికారులపై చేయి చేసుకోవడం సిగ్గు చేటని న్యాయవాదులు విమర్శిస్తున్నారు. డీఓపీగా సుదర్శన్‌రెడ్డి నియామకాన్ని కొట్టేస్తూ 2024 ఫిబ్రవరి 21న హైకోర్టు తీర్పునిచ్చింది.
గాలివీడు ఎంపీడీఓ జవహర్‌బాబుపై సుదర్శన్ రెడ్డి దాడిని స్థానికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అధికారులను బెదిరించి పనులు చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. డీఓపీ పోస్టును అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని పబ్బం గడుపుకున్నారని ప్రజలు అంటున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ముగ్గురు నలుగురు అధికారులపై సుదర్శన్ రెడ్డి దాడి చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ హెచ్చరికలు జారీ చేయడం, అధికారులకు ధైర్యాన్ని, వైఎస్సార్సీపీ నేతలకు భయాన్ని పుట్టించినట్లైంది.
కాగా, వైఎస్సార్సీపీ హయాంలో దౌర్జన్యాలు, దాడులతో రెచ్చిపోయిన ఆ పార్టీ నాయకులకు ఇంకా అధికార మదం, అహంకారం తగ్గడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి విచక్షణా రహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. గవర్నమెంట్ ఆఫీసులో అనధికార హోదా అనుభవించాలని చూసిన సుదర్శన్ రెడ్డికి అడ్డు చెప్పినందుకే ఎంపీడీఓపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సుదర్శన్ రెడ్డిని ప్రజల ముందే చొక్కా పట్టుకుని పోలీసు అధికారి ఈడ్చుకెళ్లారు.
ఇది వైఎస్సార్సీపీ రాజ్యం అనుకుంటున్నారా? - తోలు తీసి కూర్చోపెడతా ఖబడ్దార్ : పవన్ కల్యాణ్
సెల్యూట్ టు ఏపీ పోలీస్ - 'చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లిన సీఐ'