Ministers Comments On Ashok: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రొటోకాల్ ప్రకారమే శిలా ఫలకంపై పేర్లు రాయించామని వివరణ ఇచ్చారు. ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీ అని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బోడికొండపై కోదండరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొనటంతో.. మంత్రులు స్పందించారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే శ్రీరామనవమికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని హామీ ఇచ్చారు. రామతీర్థం ఆలయాల అభివృద్ధికి రూ.4కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
"ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఏ రోజూ తన విలువ కాపాడుకోలేదు. ఆయన కనీస సాంప్రదాయ, సంస్కృతి లేని వ్యక్తి . ఆలయ ధర్మకర్తకు ఇవ్వాల్సిన అన్ని మర్యదలు ఇచ్చాం. కానీ కొండపై అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారు. అశోక్ లాంటి పెద్ద వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. మనం ఎవరి రాచరిక వ్యవస్థలో లేము.. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. శంకుస్థాపనకు పిలవడానికి వెళ్లిన ఈవో, ప్రధాన అర్చకులను తిట్టారు. రామతీర్థం ఆలయాన్ని రెండో భద్రాద్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ -మంత్రులు బొత్స, వెల్లంపల్లి
తెదేపా హయాంలో ఒక్క రూపాయైనా విరాళం ఇచ్చారా? దేవాలయానికి చైర్మన్ గా ఉన్నపుడు ఆలయ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని మంత్రులు ప్రశ్నించారు. కొండపై ఏ దేవుడున్నాడో కూడా ఆయనకు తెలియదంటూ మంత్రి బొత్స విమర్శలు గుప్పించారు.
గతేడాది డిసెంబర్ 28న దుండగులు.. పురాతన శ్రీ కోదండ రామాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఇదీ చూడండి:
Ashok Fires On Govt: రామతీర్థం బోడికొండపై ఉద్రిక్తత.. రామాలయ శంకుస్థాపనలో తోపులాట