ప్రకృతి సేద్యం, పెట్టుబడి రహిత సాగు పద్ధతులు ఏవైనప్పటికీ రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ విధానాలు పాటిస్తూ ఆహార, వాణిజ్య పంటల్లో ఎందరో ఔత్సాహిక రైతులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. వీరందరికి భిన్నంగా విజయనగరంజిల్లా శృంగవరపుకోట మండలం భవానీపురంకు చెందిన కాండ్రేగుల సన్యాసినాయుడు అనే రైతు చెరకు సాగులో కూడా సేంద్రీయ విధానాన్ని అవలంభిస్తున్నారు.
సేంద్రియ సాగు వైపు అడుగులు..
సన్యాసినాయుడు తనకున్న ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆనవాయితీగా చెరకు సాగు చేస్తూ... రసాయనలతో కూడిన బెల్లం తయారు చేసేవాడు. దిమ్మెల రూపంలో బెల్లం తయారీ చేయటం.. వ్యాపారులు నిర్ణయించిన ధరకు ఉత్పత్తిని అమ్ముకునేవాడు. ఐదేళ్ల క్రితం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల సూచనల మేరకు సేంద్రీయ పద్ధతులపై దృష్టి సారించారు. పంట సాగులోనే కాకుండా... బెల్లం, బెల్లం తేనె తయారీలో సేంద్రీయ విధానాలు అనుసరించాడు. ఈ క్రమంలో హైడ్రోస్ వంటి రసాయన పదార్ధాలకు బదులు మునగాకు, బెండ, కలబంద, నిమ్మరసం వంటి వాటిని బెల్లం తయారీలో వినియోగించాడు. ఇవి మెరుగైన ఫలితాన్ని ఇవ్వటంతో ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాడు.
లాభాల బాట
ఈ పద్ధతిలో సేంద్రీయ బెల్లాన్ని అరకిలో, కిలో పరిమాణంలో తయారు చేసి పది టన్నుల వరకు విక్రయించారు. సేంద్రీయ విధానాల ద్వారా రెండిందాల లాభం చేకూరుతోందని సన్యాసినాయుడు అన్నాడు. పంట సాగు, బెల్లం తయారీలోనూ పెట్టుబడులు తగ్గటంతో పాటు.దిగుబడులు పెరిగాయని వివరించాడు . బెల్లాన్ని దిమ్మెల రూపంలో కాకుండా., చిన్నచిన్న ముక్కలుగా చేయటం వల్ల టన్నుకు ఐదు కిలోల వరకు దిగుబడి పెరిగిందని చెప్పాడు . మార్కెట్ లో బెల్లం దిమ్మెలు 35-40రూపాయల వరకు పలుకుతుండగా సేంద్రీయ ముక్కల బెల్లం కిలో 60,70 రూపాయలకు విక్రయిస్తు అధికాదాయం పొందుతున్నాడు.
ఉప ఉత్పత్తులు...
సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన బెల్లం నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. ఇందులో భాగంగా బెల్లాన్ని పొడి, ఉండల రూపంలో తయారు చేస్తున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బెల్లం తేనె శుద్ధి యంత్రం ఏర్పాటు చేసుకున్నారు. యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయనగరం శాఖ ముద్రా పథకం కింద అందచేసిన ఐదు లక్షల రుణాన్ని సద్వినియోగం చేసుకొని బెల్లం తేనెను తయారు చేస్తున్నాడు. వండిన బెల్లం పాకాన్ని ప్రత్యేక యంత్రంలో 60సెంటీగ్రేడుల ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తున్నాడు . ఇలా వేడైన పాకం శుద్ధి యంత్రంలోని ఫిల్టర్ ద్వారా వచ్చిన తర్వాత చల్లార్సి ప్రత్యేక బాటిల్లో నిల్వచేస్తున్నాడు . ఇలా సిద్ధంచేసిన పాకం తేనెను లీటర్ 120 రూపాయల చొప్పన విక్రయిస్తున్నాడు. ఇలా ఉప ఉత్పత్తుల తయారీతో అధిక ఆదాయం సమకూరుతోందని సన్యాసినాయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
వ్యాపార మేళకులు ముఖ్యం సుమా..
పంటలు పండించటమే కాక వాటి ఉప ఉత్పత్తుల తయారీ దిశగా కూడా అన్నదాతలు కృషి చేయాలని శాస్త్రవేత్తలు, నిపుణుల నుంచి తరచుగా వినిపిస్తున్న సలహాలివి. ఈ సలహాలను తూ.చా తప్పక పాటిస్తున్నాడు సన్యాసినాయుడు. బెల్లం ఉత్పత్తుల మార్కెటింగ్లోను సన్యాసినాయుడు వినూత్నంగా వ్యవహరిస్తున్నాడు. దళారులు, వ్యాపారులకు బదులుగా తానే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. తన పొలం పక్కన ఉన్న విశాఖ- అరకు రోడ్డులో స్టాల్ ఏర్పాటు చేసి అమృత మాధురి పేరున ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. దీంతో దళారుల బెడద తగ్గటమే కాకుండా... మంచి గిరాకీ పెరిగిందని వివరించాడు.
తనలా మరికొంత మందిని..
బెల్లం తయారీలో సన్యాసినాయుడు అనుసరిస్తున్న విధానాలను అనకాపల్లి చెరకు ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభినందిస్తున్నారు. శృంగవరపుకోట మండలం భవనీపురానికి చెందిన బెల్లం రైతు కాండ్రేగుల సన్యాసినాయుడు పాటిస్తున్న సేంద్రీయ పద్దతులపై తోటి రైతులు కూడా ఆకర్షితులౌతున్నారు. ఈ విధానాలు లాభదాయకంగా ఉండటమే కాకుండా వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా సేంద్రీయ పద్ధతుల దిశగా సాగుతున్నట్లు తోటి రైతులు చెబుతున్నారు. సేంద్రీయ పద్ధతిలో చెరుకును పండిచటంతో పాటు.. బెల్లం, తేనె, పొడి తయారీలో ఎటువంటి రసాయనాలు లేకుండా... ముందుకు సాగుతున్న సన్యాసినాయుడు పొలం ప్రస్తుతం తోటి రైతులకు శిక్షణ కేంద్రంగా మారింది. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఇక్కడే బెల్లం రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మరో విశేషం.
ఇదీ చదవండీ..కొండముచ్చు ఆకారంలో.. వింత గొర్రె పిల్ల