మార్కాపురంలో...
గత వందేళ్లలో రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు నిర్మిస్తే కేవలం రెండేళ్లలో 16 వైద్య కళాశాలలు నిర్మించబోయే ఏకైక ప్రభుత్వం వైకాపా అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద రూ.475 కోట్లతో నిర్మించబోయే వైద్య కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ వైద్యకళాశాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు.
మదనపల్లెలో...
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలో ఆరోగ్యం వద్ద రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించబోయే వైద్య కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కళాశాల వల్ల సమీప ప్రాంతాల వారికి వైద్యపరమైన ఇబ్బందులు తప్పుతాయన్నారు.
బాపట్లలో...
బాపట్లలోని జమ్మలపాలెం రోడ్లో రూ.505 కోట్లతో నూతనంగా నిర్మాణం చేయనున్న వైద్య కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాంతంలో వైద్య కళాశాల నిర్మించడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు అనేక మందికి ఉపాధి కల్పిస్తుందని మంత్రి సుచరిత అన్నారు.
ఏలూరు, పాలకొల్లులో...
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, పాలకొల్లులో వైద్య కళాశాలలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. మెడికల్ కళాశాలతో పాటు హాస్పిటల్, నర్సింగ్ కళాశాలల ద్వారా సమీప ప్రాంత ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని జాయింట్ కలెక్టర్ శ్రీ హిమషు శుక్లా అన్నారు.
విజయనగరంలో...
విజయనగరంలోని గాజులరేగ వద్ద రూ.500 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పాల్గొన్నారు. 70 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ కళాశాలకు అనుబంధంగా 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని పుష్ప శ్రీవాణి తెలిపారు.
ఆదోనిలో...
కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జయరాం, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆదోని-ఎమ్మిగనూరు రహదారి పక్కన నాగలాపురం గ్రామ పరిధిలో నిర్మించబోయే మెడికల్ కళాశాలను వర్చువల్ విధానంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు.
ఇదీచదవండి.