YSRCP Leaders TDP Bonds Scam: టీడీఆర్ బాండ్ల పేరుతో వైసీపీ నాయకులు సాగిస్తున్న దోపిడీ (YCP Leaders TDP Bonds Scam) పరాకాష్ఠకు చేరింది. పుర, నగరపాలక సంస్థల్లో ఒకచోట జారీచేసిన టీడీఆర్ (Transferable Development Rights) బాండ్లు ఇతర నగరాలు, పట్టణాల్లోను వినియోగించుకోవచ్చన్న నిర్ణయం తరువాత వీటికి గిరాకీ పెరిగింది. కొత్త అపార్ట్‌మెంట్లు నిర్మాణంలో ఉన్న విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో టీడీఆర్ బాండ్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
టీడీఆర్ బాండ్లు కొనుగోలు, అమ్మకాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరు దళారులతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కుమ్మక్కమవుతున్నారు. దళారుల సూచనలపై బాండ్లు జారీ చేయాలని బాధితుల తరఫున ప్రజాప్రతినిధులు అధికారులకు సిఫార్సు చేస్తున్నారు. బాండ్లు వచ్చాక మొత్తం విలువలో 20-25% వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయిన కుటుంబాలు టీడీఆర్ బాండ్లు నేరుగా పొందాలంటే అధికారులు అడ్డదిడ్డంగా కొర్రీలు పెడుతున్నారు. అదే దళారులకైతే నేరుగా పనులు చేసేస్తున్నారు.
టీడీఆర్ బాండ్లుతో కోట్లు కొల్లగొడుతున్న దళారులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు కొత్తగా దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల కాలనీ స్థలాలకు వారసులను తెరపైకి తెస్తున్నారు. స్థలాలపై హక్కులు కలిగినట్లుగా దస్తావేజులు సృష్టించి పరిహారంగా టీడీఆర్ బాండ్లు ఇస్తే చాలని.. నగరపాలక సంస్థల్లో దరఖాస్తులు చేయిస్తున్నారు.
విశాఖలో రెండు కాలనీలకు సంబంధించిన దరఖాస్తులు ప్రస్తుతం ఉన్నతస్థాయి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో మూడు దరఖాస్తులు సిద్ధం చేశారు. విశాఖ నగర శివారు మధురవాడ, కొమ్మాది తదితర ప్రాంతాల్లో ఐదు నుంచి ఏడేళ్ల ముందు అభివృద్ధి చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లులోనూ స్థలాలు కోల్పోయినట్లుగా కొందరితో టీడీఆర్ బాండ్లు కోసం దరఖాస్తులు చేయించారు.
TDR Bonds Scam: టీడీఆర్ బాండ్ల కుంభకోణం.. ఏసీబీ విచారణపై విమర్శలు
ఉత్తరాంధ్రలో అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో వైసీపీ నేత టీడీఆర్ బాండ్ల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో.. ఒక మంత్రి, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బాండ్లు జారీ చేయిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక మంత్రి, మరో మాజీమంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు, మేయర్ ఒకరు.. బాండ్లు కోసం అధికారులకు సిఫార్సులు చేయడంలో ముందుంటున్నారు. నెల్లూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల్లో ఒక మాజీ మంత్రి, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తణుకు పురపాలక సంఘంలో 1:2 నిష్పత్తికి బదులుగా.. 1:4 నిష్పత్తిలో బాండ్లు జారీ చేసిన వ్యవహారంలో కమిషనర్, మరో ఇద్దరు పట్టణ ప్రణాళిక అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. ఇందులో చక్రం తిప్పిన ప్రజాప్రతినిధి ఊసే విచారణలో లేదు. కాకినాడ నగరపాలక సంస్థ చేపట్టిన కన్వర్టబుల్ స్టేడియం నిర్మాణంతో స్థలం కోల్పోయిన కుటుంబాలకు చదరపు గజం రూ.18 వేలుకు బదులుగా.. రూ.36 వేలు చొప్పున టీడీఆర్ బాండ్లు జారీ చేసిన వ్యవహారంలోనూ సబ్ రిజిస్ట్రార్‌ని ప్రభుత్వం సస్పెండ్ చేసి మమ అనిపించింది.