కరోనా మహమ్మారి ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రాణాలు తీస్తోంది. ఈ తరుణంలో ఆస్తమా బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ‘ప్రపంచ ఆస్తమా దినం’ సందర్భంగా ప్రత్యేక కథనం..!
విశాఖ నగరంలో లక్ష వరకు బాధితులు
గతంలో కంటే ఆస్తమా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి పది మందిలోనూ ఒకరు ఉంటున్నారంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు. విశాఖ నగర వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకూ బాధితులు ఉన్నట్లు వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పుల వల్ల చిరుప్రాయంలోనే వ్యాధి సోకుతోంది. మూడు నెలల నుంచి అయిదేళ్ల చిన్నారులకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది.
వ్యాయామంతో మెరుగైన ఫలితాలు
ఆస్తమా బాధితులు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారని వైద్యులు పేర్కొంటున్నారు. దుమ్ము, ధూళి, పొగ, చల్లగాలి, చల్లటి వస్తువులకు దూరంగా ఉండాలి. వైద్యులు సిఫార్సు చేసిన మందులను మాత్రమే వాడాలి. వర్షాకాలంలో ఎక్కువగా గదిలోకి గాలి రాకుండా కిటికీలను మూసి ఉంచాలి. పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలు, కప్‌బోర్డులు, పుస్తకాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తరచూ వ్యాయామం, యోగా, ధ్యానం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న బాధితుల సంఖ్య
ప్రజలను పట్టిపీడిస్తున్న ప్రధాన వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఉబ్బసంగా పిలుస్తారు. చిన్నారుల పాలిట యమపాశంగా భావించే ఈ వ్యాధి విస్తరణపై ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. కాలుష్య కాసారంగా మారిన విశాఖ నగరంలో ఏటా ఈ వ్యాధి పీడితుల సంఖ్య పెరుగుతోంది. బాధితులు మందులతో ఉపశమనం పొందుతున్న తరుణంలో కరోనా విజృంభిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది.
వంశపారంపర్యంగానూ..
ఆస్తమా ఊపిరితిత్తులకు సంబంధించింది. ఈ వ్యాధి బాధితుల ఛాతి బిగుతుకావడంతో పాటు ఊపిరితిత్తులు మూసుకుపోతాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. శీతాకాలంలో ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. రాత్రి, ఉదయం పూట దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ప్రారంభమవుతుంది. వంశపారంపర్యంగానూ ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. దుమ్ము, చల్లదనం, పుప్పొడి, ఉన్ని, జూలుతో ఉన్న పెంపుడు జంతువులు, వైరస్లు, బ్యాక్టీరియా, వాయు కాలుష్యం, భావోద్వేగాల కారణంగా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: