విశాఖ జిల్లా పాడేరులో.. గొందూరు కాలనీకి చెందిన మహిళ.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు.. ఆమె రాసి సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్ వచ్చిందని.. తన మరణానికి ఎవరూ కారణం కాదని అందులో ఆమె పేర్కొంది. ఒళ్లంతా మంటలతో తాను ఇబ్బంది పడుతున్నానని.. ఆ సమస్య తగ్గని కారణంగానే... భరించలేక ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాని లేఖలో వెల్లడించింది.
అర్థరాత్రి వేళ...
పళ్ల ప్రసాద్ అనే ఉపాధ్యాయడు, అతని భార్య పద్మలక్ష్మి (36), ఇద్దరు పిల్లలతో కలిసి గ్రామంలో నివసిస్తున్నారు. పద్మలక్ష్మికి ఇటీవల కరోనా సోకింది. చికిత్స అనంతరం నెగిటివ్ రాగా.. ఇటీవల ఒళ్లంతా తీవ్రంగా మంటగా ఉంటోందని కుటుంబ సభ్యులకు తెలిపింది. ప్రసాద్ తెల్లారి లేచి చూస్తే భార్య ఇంట్లో కనపడలేదు. వెంటనే తన పిల్లలతో ఆసుపత్రిలో, తన పొలంలో వెతికారు. చివరికి కొత్త పాడేరు వెళ్లేదారిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విగతజీవిగా పడి ఉంది. తన చావుకు ఎవరూ కారణం కాదని.. అనారోగ్యం వల్లనే మరణిస్తున్నాని సూసైడ్ నోట్లో మృతురాలు తెలిపింది.
నా భార్యకు కరోనా వచ్చింది. ట్రీట్మెంట్ చేయించాం. ఆ తర్వాత తనకు బాగానే ఉంది. అయితే.. ఇటీవల ఒళ్లంతా మంటగా ఉందని.. బాగా దాహం వేస్తోందని అనేది. వాళ్ల బంధువులకు కూడా ఫోన్ చేసింది. తాను త్వరలోనే చనిపోతామేనని, బతకనేమో అని వారికి చెప్పింది. రాత్రి నిద్రపోయిందనే అనుకున్నాం. తెల్లవారుజామున 3 గంటలకు మా పాప లేచింది. అమ్మ కనిపించకపోయేసరికి ఏది.. అని అడిగింది. పాప, నేను హస్పిటల్‌కు వెళ్లి చూశాం. అక్కడ కనిపించలేదు. పొలం వైపు వెళ్లి చూశాం.. అక్కడ కూడా లేదు. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడిపోయి ఉంది. ఆత్మహత్య చేసుకుంది. -మృతురాలి భర్త
మరోవైపు.. మృతురాలి కుమార్తె సైతం.. ఘటనపై కన్నీటిపర్యంతమైంది. తన తల్లి చనిపోయిన తీరును తలుచుకుంటూ కుమిలిపోయింది. పద్మలక్ష్మి మరణంపై ఆమె భర్త, ఇద్దరు పిల్లలు పడుతున్న బాధకు స్థానికులు సైతం చలించిపోయారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టుకునేంత ఎత్తులోనే ట్రాన్స్ఫార్మర్
చేతికి అందే ఎత్తులో ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో.. చాలా మంది ప్రమాదానికి గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారని విద్యుత్ అధికారుల మీద మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి.. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:
Accidents: జిల్లాలో 2 ప్రమాదాలు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు