ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడే వారంతా చలికాలంలో ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహాలు పాటిస్తూ.. వారు సూచించిన మందులు వేసుకోవాలి. కరోనా బారిన పడి శ్వాస సంబంధ సమస్యలతో బాధపడే వారిలోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయని జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ నివేదిక చెబుతోంది.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్ చర్యల్లో భాగంగా నెల కిందట పాఠశాలలు, కళాశాలలు తెరచుకున్నాయి. విశాక మన్యంలో చలి, మంచు అధికంగా ఉన్నందున విద్యార్థులు మాస్కులు, ఉన్ని దుస్తులు ధరించి తరగతులకు హాజరవుతున్నారు. వీరిలో కొందరు రొంప సమస్యతో బాధ పడుతున్నారు. వారికి కొన్నాళ్లపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. కాలానుగుణ వ్యాధులకు సంబంధించి పిల్లల వస్త్రధారణ, ఆహారం, జీవనశైలి విషయంలో పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని చెబుతున్నారు.
బాధితుల్లో పిల్లలు, వృద్ధులే అధికం
కరోనా వైరస్ బారిన పడిన వారిలో చిన్నపిల్లలు, యువకులతో పోలిస్తే వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో త్వరగా వైరస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. మధుమేహం, రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వృద్ధుల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని.. వారు చలికాలంలో ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మేలని సూచిస్తున్నారు.
అత్యవసరమైతేనే ప్రయాణాలు
పండుగలు, శుభకార్యాలకు వెళ్లే వారితో బస్సులు, రైళ్లు రద్దీగా ఉంటున్నాయి. అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోవాలి. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించడం ఉత్తమం. ఉన్ని దుస్తులతోపాటు ముఖానికి మాస్కు, తలకు మంకీ క్యాప్ ధరించడం మరిచిపోవద్దు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు.. చలి, మంచులో బయటకు రాకుండా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. కొవిడ్ బారిన పడి మూల్యం చెల్లించాల్సి రావచ్చు. పర్యటక ప్రాంతాల సందర్శనకు వచ్చే వారూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం
శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు కొవిడ్ బారిన పడకుండా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. చలి, మంచులో తిరగడం వల్ల ఎవరికైనా జలుబు చేస్తే.. తగ్గే వరకు పాఠశాలకు రావద్దని సూచిస్తున్నాం. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా 9, 10 తరగతుల విద్యార్థులకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల విషయంలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇళ్ల వద్ద తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నాం. -- సరస్వతిదేవి, ఎంఈవో, పాడేరు
తస్మాత్ జాగ్రత్త
చల్లని వాతావరణంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. శ్వాస సంబంధ సమస్యలతోపాటు షుగర్, బీపీ, కిడ్నీ బాధితులు వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడాలి. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఇంటి నుంచి బయటకు రాకూడదు. తప్పనిసరి అయితేనే ప్రయాణాలు పెట్టుకోవాలి. సుస్తీ చేస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. -- లీలాప్రసాద్, కొవిడ్ ప్రత్యేక వైద్యాధికారి, పాడేరు
ఇవీ చదవండి..
కరోనా ఎఫెక్ట్: కళాకారుల కష్టాలు.. తీర్చేవారి కోసం ఎదురుచూపులు