Vizag Metro Works: దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఇంతవరకు మెట్రో రైళ్లు లేవు. అందుకే రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీకి మెట్రోరైళ్ల అవసరాన్ని తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి.. విశాఖ, విజయవాడల్లో ప్రతిపాదించింది. వాటి సాకారానికి.. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 2014లోనే విశాఖ మెట్రో రైలుకి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర డీపీఆర్‌కు 2014 జూన్ 27నే కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. 8 వేల 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 42.55 కిలో మీటర్ల పొడవునా మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం తలపెట్టింది. కేంద్రం ప్రభుత్వ సూచనతో.. PPP విధానంలో చేపట్టాలని నిర్ణయించి.. టెండర్లు పిలిచింది. కానీ టెండర్లను, డీపీఆర్‌ను వైసీపీ సర్కార్ రద్దు చేసేసింది.
గత ప్రభుత్వ ప్రతిపాదనలు కాదని.. అనకాపల్లి నుంచి విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం వరకు జాతీయ రహదారి వెంబడి 140.13 కిలో మీటర్ల పొడువునా మెట్రోరైల్ కారిడార్ల నిర్మాణం చేడతామని.. జగన్ ప్రభుత్వం ప్రకటించింది. 2019 డిసెంబరులో పురపాలక శాఖ మంత్రి హోదాలో మంత్రి బొత్స.. ప్రతిపాదిత కారిడార్ల పరిశీలన పేరుతో హడావుడి చేశారు. అంతే మళ్లీ చప్పుడు లేదు. పురోగతి ఏదైనా ఉందంటే.. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ఆంధ్రప్రదేశ్ మెట్రోరైల్ కార్పొరేషన్‌గా మార్చడం ఒకటే. విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించడం మాత్రమే.
ప్రస్తుతం విశాఖ నగరం.. అనకాపల్లి, పెందుర్తి, తగరపువలస వరకు విస్తరించింది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. అక్కడికీ విస్తరిస్తుంది. విశాఖ, శివారు ప్రాంతాల జనాభా ప్రస్తుతం 30 లక్షలకుపైనే ఉంది. 2 ఓడరేవులు, విశాఖ ఉక్కు సహా అనేక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు, పరిశ్రమలకు విశాఖ కేంద్రం. దేశంలోనే పది ధనిక నగరాల జాబితాలోనూ ఉంది. అలాంటి విశాఖకు మెట్రో రైలు వస్తే.. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. కానీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై శ్రద్ధచూపని జగన్ ప్రభుత్వం.. విశాఖ మెట్రోపైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
"విశాఖ మెట్రో ప్రాజెక్టుకి నిధులిచ్చేందుకు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ విముఖత వ్యక్తం చేసిన వేళ.. ఆ ప్రాజెక్టుకి కేంద్రం ఆర్థిక సాయం చేయనుందా?’’ అని వైసీపీకు చెందిన ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బి.వి.సత్యవతి లోక్‌సభలో ప్రశ్నించారు. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. 2023 ఫిబ్రవరి 2న కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌషల్ కిశోర్ బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 140.3 కిలోమీటర్ల పొడవున విశాఖ మెట్రో మార్గాన్ని నిర్మిస్తామని చెబితే, ఎంపీలు 75.3 కిలోమీటర్లకు సాయం చేస్తున్నారా? అని కేంద్రాన్ని అడగడమేంటి? అసలు అవగాహన ఉండే ఆ ప్రశ్న వేశారా?.
విజయవాడ, విశాఖల్లో మెట్రో రైళ్ల ఏర్పాటుపై విభజన చట్టంలో చెప్పినా.. వైసీపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. 46.42 కిలోమీటర్ల మొదటి దశను 2020-24 మధ్య, 77.31 కిలోమీటర్ల రెండో దశను 2023-28 మధ్య, 16.40 కిలోమీటర్ల మూడో దశను 2027-29కి పూర్తి చేస్తామని మూడున్నరేళ్ల క్రితం మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఎలాంటి కదలికా లేదు.