జగన్ పాలనలో ఎవ్వరికీ రక్షణ లేదని.. చివరికి దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రామతీర్థం పవిత్ర క్షేత్రంలో రాముని శిరస్సును తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహానికి శిరస్సు అతికించడంపై ప్రభుత్వం చర్చిస్తున్నా.. నిందితుల గురించి సీఎం జగన్ ఆలోచన చేయకపోవడం దురదృష్టమన్నారు.
అన్ని మతాలను సీఎం గౌరవించాలని.. హిందూ మనోభావాలు దెబ్బతింటున్నా సీఎం జగన్ కు చీమకుట్టినట్టు లేదని మండిపడ్డారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్ దర్శనం చేసుకున్న దగ్గర్నుంచీ దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ అంశంపై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు అవినీతి చేయలేదని.. ఉపమాక వెంకన్నపై ప్రమాణం చేయగలరా అంటూ ఆమె ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ' అధికారులు లంచం అడిగితే.. చెట్టుకు కట్టి కొట్టండి..'