విశాఖలో అనాథలు చనిపోయినట్లు సమాచారం వస్తే వెంటనే వానపల్లి రవికుమార్ అక్కడికి వెళ్లేవారు.. సొంత ఖర్చుతో దహన సంస్కారాలు నిర్వహించేవారు. పలువురు పోలీసులు కూడా అనాథ శవాలను గుర్తిస్తే ఆయనకే సమాచారం ఇచ్చేవారు. అటువంటి ఆపద్బాంధువుడు ఇప్పుడు కరోనాతో కన్నుమూశారని తెలుసుకుని స్నేహితులు, సన్నిహితులు దిగ్భ్రాంతి చెందారు.. అనాథ మృతదేహాలకు అంత్య క్రియలే కాదు.. సేవా కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించేవారు. దీని కోసం సాయిపూజా ఫౌండేషన్ ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకు 600మందికి ఉచిత కంప్యూటర్ శిక్షణ, 150 మందికి పాఠశాల, కళాశాల ఫీజులు చెల్లించడం, అత్యంత నిరుపేదలైన 35 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ, 75 మందికి కృత్రిమ అవయవాలు అందజేశారు. గత సంవత్సరం లాక్‌డౌన్ సమయంలో సుమారు 1,30,000 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. రాజకీయాల్లోనూ ఆయనకు అజాతశత్రువుగా పేరు ఉంది. జీవీఎంసీ ఎన్నికల్లో 31వ వార్డుకు తెదేపా తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొందారు.
భార్య కోలుకున్నా... వానపల్లి మృత్యుఒడిలోకి..
వానపల్లి రవికుమార్‌కు ఈనెల 13న, భార్య, కుమారులకు ఈనెల 15న కొవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నా తగ్గకపోవడంతో ఈనెల 19న ఆయన, 20న సతీమణి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరూ ఒకే గదిలో ఉండి చికిత్స పొందారు. ఆస్తమాతో బాధపడుతున్న రవికుమార్ ఆరోగ్యం ఈనెల 22న ఆందోళనకరంగా మారడంతో ఐ.సి.యు.కు తరలించారు. భార్య కోలుకోవడంతో ఈనెల 23న డిశ్ఛార్జి చేశారు. వానపల్లి కరోనాను జయించి ఇంటికి వస్తాడని అందరూ ఎదురు చూశారు. కాని విధి మరోలా తలచింది. ఆయన్ను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది.. దీంతో నగరంలోని అనాథ శవాలకు ఇక ఎవరు దిక్కని పలువురు వాపోయారు.
తల్లి తన కుమారుడిని ఆఖరుచూపు చూడాలని కోరడంతో డాబాగార్డెన్స్‌లోని ఇంటికి వానపల్లి పార్ధివదేహాన్ని తీసుకెళ్లారు. అనంతరం జ్ఞానాపురంలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్‌తో చనిపోయారని తెలిసినప్పటికీ మిత్రుడు మురళి, అభిమానులు సుమారు 200 మంది అంత్యక్రియలకు హాజరయ్యారు. దూరం నుంచే విగతజీవిగా ఉన్న ఆయన్ను చూసి కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చదవండి: