8వ రోజుకు రిలే నిరాహార దీక్షలు
అఖిలపక్ష కార్మిక సంఘాలు విశాఖ కోసం చేస్తున్న నిరాహార దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన ధర్నాలకు అన్నివర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. అఖిలభారత వికలాంగుల సంఘం ప్రతినిధులు వారికి సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తే తమలాంటి వికలాంగులు రిజర్వేషన్లు కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎప్పటికీ అలాగే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు
పాదయాత్ర
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేయాలంటూ తెదేపా కార్పొరేటర్లు స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఎదురయ్యే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ.. అవగాహన కల్పించే ఉద్దేశంతోనే పాదయాత్ర నిర్వహించామని తెదేపా కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసేందుకు మద్దతు తెలుపుతూ 98 కార్పొరేటర్లు అంగీకరించడం హర్షదాయకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి. సముద్ర జలాల్లో 61రోజుల పాటు వేట నిషేధం