విశాఖ, విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో విక్రయించగా మిగిలి ఉన్న ప్లాట్లకు, కొన్ని ఆడ్ బిట్లకు విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వేలం పాట నిర్వహించనుంది. ఈనెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొత్తం 42 ప్లాట్లను వేలానికి అందుబాటులో ఉంచింది. వాటికి అప్‌సెట్ ధర ఇటీవల నిర్ణయించి వీఎంఆర్‌డీఏ వెబ్‌సైట్లో పెట్టింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం..
* మధురవాడలోని సర్వే నంబరు 111/6పిలో 300 చ.గజాలు, 116/1లో 336.73 చదరపు గజాల స్థలాలకు అత్యధిక ధర ప్రకటించింది. వీటికి గజం ధర రూ.96 వేలుగా నిర్ణయించారు. ఈ ధర ప్రకారం ఇక్కడ భూముల విలువ రూ.3 కోట్లకు పైగా ఉండనుంది.
* మాధవధారలోని ప్లాట్ నంబరు 276లో 93.25 చ.గజాల ఆడ్‌బిట్ గజం ధర రూ.66 వేలుగా ప్రకటించారు. రుషికొండ, మధురవాడ, పెదగంట్యాడ ప్రాంతాల్లో మూడు స్థలాలు ఉంటే వాటికి గజం ధర రూ.40 వేలుగా నిర్ణయించారు. కాపులుప్పాడలోని రెండు స్థలాలకు గజం అప్‌సెట్ ధర విలువ రూ.23 వేలుగా పేర్కొన్నారు. విజయనగరం వుడా లేఅవుట్లోని మూడు ఆడ్ బిట్లను విక్రయానికి ఉంచగా గజం ధర రూ.12 వేలుగా నిర్ణయించారు.
* దాకమర్రి వీఎంఆర్‌డీఏ ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్‌లో అధిక, మధ్య ఆదాయవర్గ ప్రజల కోసం అభివృద్ధి చేసిన ప్లాట్లలో మిగిలిపోయిన 30 ప్లాట్లకు వేలం పాట నిర్వహించనున్నారు. వీటిలో అధికంగా 200 నుంచి 300 గజాలపైబడిన స్థలాలు ఉన్నాయి. ఈ ప్లాట్ల గజం అప్‌సెట్ ధర రూ.17 వేలుగా అధికారులు నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో నిర్వహించే వేలం పాట తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు కమిషనర్ కోటేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి: పచ్చదనం కంటికెంతో ఆహ్లాదకరం