విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఆంజనేయశర్మ తయారు చేసిన కుక్కర్ అందరినీ ఆకట్టుకుంటోంది. గ్యాస్, విద్యుత్‌తో పని లేకుండా సౌరశక్తితో పనిచేసేలా దీనిని రూపొందించారు. తనకు ఉన్న ఇంజినీరింగ్ నైపుణ్యంతో పర్యావరణహితంగా తయారు చేసిన ఈ ఆవిష్కరణతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. అపార వనరుగా ఉన్న సౌర శక్తిని విభిన్నంగా వినియోగించుకునేలా ఆంజనేయ శర్మ చేసిన పరిశోధన ఇప్పుడు సత్ఫలితాన్నిస్తోంది. సౌర శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే అంశానికి కొత్తదనాన్ని జోడిస్తూ సోలార్ కుక్కర్ ను తయారు చేశారు.
శ్రమించి... చివరికి సాధించి
సోలార్ కుక్కర్ తయారీ వెనుక ఆంజనేయశర్మ పదేళ్లు కష్టం దాగి ఉంది. ఎండలో అద్దాలను ఉంచి వాటి ద్వారా కాంతి కిరణాలను ఒక చోటికి పరావర్తనం చెందేలా చేయడం ద్వారా అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తున్నారు. ఆ వేడితో ఏ పదార్థాన్నైనా వండుకోవచ్చని అంటున్నారు ఆంజనేయశర్మ. ఈ నమూనా పరిశీలించిన కొంతమంది శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెబుతున్నారు. ఈ పరిజ్ఞానానికి కాంపౌండ్ పారాబొలిక్ సౌర కుక్కర్‌గా నామకరణం చేశారు ఆంజనేయ శర్మ. రోజుకు రెండు... మూడు సార్లు ఒక సౌర కుక్కర్‌పై వంట చేసే వీలు ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ సోలార్ కుక్కర్ తయారీని ఓ పరిశ్రమగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.