Nephew and Sister-in-Law killed Their Uncle in Land Dispute: పొలం పంపకంలో వచ్చిన విభేదాలు కుటుంబంలోని ఓ వ్యక్తి ప్రాణం తీసేందుకు దారి తీసింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. మృతుని భార్య నిమ్మమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామానికి చెందిన చెన్నుపాటి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావులు అన్నాదమ్ములు. నాగేశ్వరరావు మరణించిన తర్వాత అతని భార్య మల్లీశ్వరి ఆస్తులు భాగాలు పంచాలని కోరింది.
ఓ పొలం పంపకంలో 25 సెంట్లు వద్ద రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. 25 సెంట్లు మాది అంటే మాది అని గత కొన్ని సంవత్సరాలుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతుంది. పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం లభించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
25 సెంట్ల భూమి కోసం ఘర్షణ: ఈ రోజు వివాదంలో ఉన్న పొలాన్ని మల్లీశ్వరి, ఆమె పెదనాన్న కుమారుడు ట్రాక్టర్‌తో దున్నుతుండగా విషయం తెలుసుకున్న చెన్నుపాటి వెంకటేశ్వర్లు కుటుంబం అక్కడికి వెళ్లి అడ్డగించింది. ఈ క్రమంలో మల్లీశ్వరి వెంకటేశ్వర్లు భార్య నిమ్మమ్మపై దాడి చేసింది. మల్లీశ్వరితో పాటు వచ్చిన అన్నయ్య ట్రాక్టర్‌తో వెంకటేశ్వర్లు, సాంబయ్యని ఢీ కొట్టబోయాడు. ఈ క్రమంలో సాంబయ్య తప్పుకోగా వెంకటేశ్వర్లు ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేవలం 25 సెంట్ల భూమి కోసం ఘర్షణ పడి చివరకు మేనల్లుడు, మరదలు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కరెంట్ కట్ చేసిన అధికారులు - ప్రాణం తీసిన కొవ్వొత్తి
గంజాయి క్వీన్ నీతూ కోసం తీవ్రంగా గాలింపు - ఫ్యామిలీ మొత్తం ఇదే దందా