విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొండను.. అభివృద్ధి పేరిట రహదారి మార్గం ఏర్పాటు పేరుతో పెద్ద ఎత్తున కొల్లగొట్టారు. దాతల సహకారం అన్న పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా.. గణేశ్ కన్స్ట్రక్షన్స్ వారు ఈ కొండను తొలిచేసి రహదారి నిర్మాణం చేపట్టారు. మాస్టర్ ప్లాన్ అనుగుణంగా లేని ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్ ఆజాద్ నేతృత్వంలోని కమిటీ.. అప్పటి ఈఓ వెంకటేశ్వరరావు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది.
దీనిపై దేవాదాయ శాఖ ఈవోను బదిలీ చేసి మాతృ శాఖకు సరెండర్ చేసింది. విచారణ కొనసాగించాలని నిర్ణయించిన గనుల శాఖ అధికారులు ఈ అంశంపై పరిశీలన ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించి గ్రావెల్ పెద్ద ఎత్తున తరలిపోయిన వైనాన్ని గుర్తించారు.
ఇప్పటివరకూ ఎంత గ్రావెల్ తరలించారు, ఎంత మొత్తంలో తరలిపోయిందన్న అంశాల్ని అంచనా వేశారు. మొత్తం గ్రావెల్ తవ్వకం కోసం గనుల శాఖకు రూ. 90 లక్షల వరకు రాయల్టీ చెల్లించాలని నిర్ధరించారు. అనుమతి ఇచ్చిన చోట్ల 15 వేల క్యూబిక్ మీటర్లు, అనుమతి లేని చోట్ల 17, 500 క్యూబిక్ మీటర్లు తగ్గినట్లు అధికారులు గుర్తించారు. అప్పన్న కొండపై లాక్ డౌన్ సమయంలో జరిగిన ఈ వ్యవహారంపై కొందరు ఉద్యోగులు కూడా గణేష్ కన్స్ట్రక్షన్స్కు సహకరించినట్లుగా తెలుస్తోంది.
మాస్టర్ ప్లాన్‌కి వ్యతిరేకంగా దుకాణాలు నిర్మించాలనుకోవడం... దేవస్థానం భూముల్లో అక్రమ కట్టడాలను నిరోధించక పోవడం వంటి అంశాలపై డిప్యూటీ కలెక్టర్ శైలజ పైనా చర్యలు ఉంటాయని స్పష్టమవుతోంది. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్లే ఈ అక్రమాలు జరిగాయని తెలుస్తోంది.
ఇవీ చదవండి.. విద్యార్థుల నుంచి కళాశాలల 'ఆన్‌లైన్ దోపిడీ'