COUPLE DIED IN ACCIDENT: సంక్రాంతి పండగ కోసం కుటుంబ సభ్యులకు కొత్త దుస్తులు కొనడానికి విశాఖ నగరానికి ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతుల్ని విధి కబళించింది. సోమవారం మధ్యాహ్నం తాటిచెట్లపాలెం వద్ద జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. సబ్బవరం మండలం గుల్లేపల్లి ప్రాంతానికి చెందిన కొల్లూరి నగేష్(43) భార్య స్వర్ణ(35)తో కలసి ద్విచక్ర వాహనంపై నగరానికి బయలుదేరారు. జాతీయ రహదారిపై ఎన్‌ఏడీ మీదుగా వస్తుండగా తాటిచెట్లపాలెం సిగ్నల్ పాయింట్ వద్దకు వచ్చేసరికి కాంక్రీట్ మిక్సర్ లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం మీద నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే దంపతులు మృతి చెందారు.
- బంధువుల సమాచారం ప్రకారం ఈ దంపతులది అన్యోన్య సంసారం. వారి చివరి మజిలీలోనూ అది కనిపించింది. వాహనం వెనుక కూర్చున్నప్పుడు ఎలా అయితే భర్తను భార్య పట్టుకొని ఉందో, ప్రమాదం జరిగాక కూడా అదే మాదిరిగా ఆమె చేతులు అతని భుజంపై వేసే ఉండడం చూపరులకు కన్నీరు తెప్పించింది.
ఇద్దరూ పట్టభద్రులే..
నగష్ డబుల్ ఎమ్మెస్సీ చేశారు, స్వర్ణ కూడా ఎమ్మెస్సీ చేసింది. ఉద్యోగాలు రాకపోవడంతో వృత్తిరీత్యా కిరాణా వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె శ్రీవర్షిణి (14), కుమారుడు జిష్ణుకుమార్ (10). వీరు సుజాత నగర్‌లోని ఓ ప్రయివేటు పాఠశాలలో 8, 6 తరగతులు చదువుతున్నారు. నగేష్ తండ్రి కొల్లూరి దుర్గారావు గుండె సంబంధ అనారోగ్యంతో బాధపడుతుండటంతో జరిగిన సంఘటనను ఆయనకు తెలియనీయలేదు. దంపతుల మరణ వార్త విన్న గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.
- ఈ దంపతులు తమకున్నంతలో పేదలకు సహాయం చేసేవారని, స్వర్ణ గ్రామంలోని రామాలయంలో తెల్లవారుజామునే రామకీర్తనలతో ప్రజలను మేల్కొలిపేవారని స్థానికులు తెలిపారు.
- ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో అరగంట సేపు ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సీఐ కె.కష్ణ, ఎస్.ఐ. శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: