కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన దేశ వ్యాప్త బంద్‌లో భాగంగా విశాఖలో వామపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. మద్దిలపాలెం బస్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పలు జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కార్మిక చట్టాలను కాపాడాలంటూ నినాదాలు చేశారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో బంద్ పాక్షికంగా జరిగింది. రెండో సారి అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని నేతలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
విశాఖ జిల్లా అరకు లోయలో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. బంద్ కు మద్దతుగా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రధాన రహదారి మార్గంలో కార్మికులు, గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు.
విశాఖ జిల్లా తగరపువలసలో దేశవ్యాప్త బంద్‌లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో... పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సార్వత్రిక సమ్మెలో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలో కార్మిక సంఘాలు కదంతొక్కాయి. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. కార్మిక చట్టాలను బలహీనపరిస్తోందని ఆరోపించారు.
కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు బంద్ నిర్వహించారు. ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు, మున్సిపల్ కార్మికులు, కొలగార్ల సంఘ సభ్యులతో పాటు పలువురు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి...