విశాఖలోని హోటల్స్, రెస్టారెంట్లలో ఆహార, విజిలెన్సు అధికారులు చేస్తోన్న వరుస దాడుల్లో నిర్ఘాంతపరిచే అంశాలు బయట పడుతున్నాయి. ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు... నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు అందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పాడైపోయిన పదార్థాలనే సగం ధరకే ఆన్ లైన్ ఫుడ్ పోర్టల్స్, ప్రజలకు రాయితీలు ఇచ్చి వారిని ఆకర్షిస్తున్నాయని చెబుతున్నారు. ఆన్లైన్ ఆర్డర్లు వచ్చినప్పుడు వినియోగదారులకు అందించేది నిల్వ ఉన్న పదార్థాలేనని అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
నేరుగా వెళ్లి తినుబండారాలు కొనుక్కునే వారికే హోటల్స్ కాస్త మంచి ఆహారం అందిస్తున్నాయని, ఆన్ లైన్ ఆర్డర్లకు పంపిణీ చేసే ఆహారాల్లో తాజాగా కనిపించేలా రసాయనాలు వాడుతున్నారని తెలిపారు. ఇలాంటి ఆహార పదార్థాల్లో కేన్సర్ కారకాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన వారికి పంపిణీ చేసిన ఆహారంపై హోటల్స్ బాధ్యత వహించడం లేదని.. ఏదైనా సమస్య ప్రస్తావిస్తే ఆన్లైన్ సంస్థదే బాధ్యత అని తోసిపుచ్చుతున్న ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి. కాబట్టి ఇంటి వంటే మేలని అధికారులు సూచిస్తున్నారు.
వరుస సోదాల నిర్వహణ విషయంలో రాజీ పడే ప్రసక్తిలేదని చెప్తున్నారు విశాఖ విజిలెన్సు అధికారులు. ఆహార పదార్ధాలు కల్తీ చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని చెబుతున్నారు. ఆహార పదార్ధాలు కల్తీ చేయడం వినియోగదారుల ప్రాణాలతో చెలగాటాలాడడమే అని అంటున్నారు.