విశాఖ మధురవాడలో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ కుటుంబ మృతి కేసుపై.. పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చిన వివరాలు విశ్లేషించారు. దంపతుల పెద్ద కుమారుడే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్థరణకు వచ్చారు.
"సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. రాత్రి 9 గంటల సమయంలో చివరిగా తండ్రి బంగారునాయుడు.. వారి ఇంట్లోకి ప్రవేశించారు. పెద్ద కుమారుడు దీపక్ తో ఇంట్లోని వారికి వివాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నాం. ఆ సమయంలోనే మిగిలిన వారిపై అతను దాడి చేసి ఉండవచ్చు. అందుకు అనుగుణంగానే మృతులు బంగారునాయుడు, నిర్మల, కశ్యప్ శరీరాలపై గాయాలు.. రక్తపు మరకలు ఉన్నాయి. రాత్రి వారి ఫ్లాట్ నుంచి వాగ్వాదానికి సంబంధించిన కొన్ని కేకలు వినిపించినట్లు పక్క ఇంట్లోని వారు తెలిపారు" - విశాఖ పోలీసులు
ఇంట్లో మంటలు చెలరేగడానికి దీపక్ కారణమై ఉంటాడని.. ఆ మంటల ప్రభావంతో శ్వాస ఆడక అతను సైతం ఉక్కిరి బిక్కిరై మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతర్గత కలహాలే ఈ విషాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నామని.. అయితే వాస్తవాలు వెలికి తీసేలా దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఆ కుటుంబంలోని వాళ్లంతా చాలా మంచి వాళ్లని.. ఎవరితోనూ విభేదాలు లేవని వారి కుటుంబీకులు సైతం చెబుతున్నారని వివరించారు. పోస్టుమార్టం నివేదికలు వచ్చాక.. ఈ ఘటనపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి: