AP Ministers Meeting on Ganja and Drug Control: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్సును ఇక నుంచి ఈగల్ అనే పేరుతో వ్యవహరించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై హోం మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో మంత్రుల కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారా లోకేశ్, వైద్యోరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సమావేశానికి హాజరై వివిధ అంశాలపై చర్చించారు.
గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపేలా ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్, నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ప్రజలను చైతన్యపరచి డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని వెల్లడించింది. నినాదాలు, ప్రతిజ్ఞలతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల ద్వారా అవగాహన సదస్సుల నిర్వహణకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలియచేసింది. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని యువతను భాగస్వామ్యం చేసి పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్టు మంత్రుల కమిటీ పేర్కోంది. సమాచార శాఖతో పాటు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ప్రచారం కల్పించి పక్షాళన చేపడతామని వెల్లడించింది.
పీడీఎఫ్ రైస్ అక్రమంగా ఎగుమతి - సముద్రంలోకి వెళ్లి తనిఖీలు చేసిన కలెక్టర్
సీఎం చంద్రబాబు చేతులమీదుగా త్వరలోనే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరించనున్నట్లు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఎక్కడ గంజాయి, డ్రగ్స్ గురించిన సమాచారం తెలియపరచినా సత్వరమే స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్ట వ్యవస్థను రూపొందిస్తున్నామని అన్నారు. గంజాయి సాగు, సరఫరాపై డేగకన్నేసి నిశితంగా నిఘా పెట్టనున్నట్లు వివరించారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి రవాణా మార్గాలను అడ్డుకుంటామని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు అడుగులు వేస్తున్నట్టు తెలిపారు.
జీపీఎస్, ఆర్ఎఫ్ఐడీ, ట్రాకింగ్ సిస్టం, ఏఐ ఆధారిత సీసీ నిఘా,ఫేసియల్ రికగ్నిషన్, ప్రొఫైలింగ్, సోషల్ మీడియా మానిటరింగ్, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఇంటెలిజెన్స్, ఐటీ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు మంత్రి అనిత సూచించారు. పోలీస్, జీఏడీ, వైద్య, అటవీశాఖ, జిల్లాలలోని అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో గంజాయిని అరికడతామని పేర్కొన్నారు. వచ్చే 6 నెలల్లో గంజాయిని అంతమొందించే దిశగా అన్ని మార్గాలపైనా దృష్టిసారిస్తామని కమిటీకి నేతృత్వం వహిస్తున్న హోమంత్రి అనిత వెల్లడించారు.
సముద్రంలో నిలిచిన బోటు - అధికారుల సత్వర స్పందన - 9 మంది మత్స్యకారులు సేఫ్