విశాఖ జిల్లా చీడికాడ మండలం తెనుగుపూడి అటవీ సెక్షన్ పరిధిలోని తంగుడుబిల్లి పొలాల్లో గిరినాగు పాము కలకలం సృష్టించింది. సుమారు 14 అడుగుల పొడవు ఉన్న గిరినాగును ఆ ప్రాంత రైతులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఈస్టర్న్ ఘాట్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సభ్యుల సహకారంతో అటవీ అధికారులు పామును పట్టుకున్నారు. వైల్డ్‌లైఫ్ సొసైటీ సభ్యులు పొదల్లో ఉన్న గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు.
పాములను రక్షిస్తున్నాం
ఇండియన్ కింగ్ కోబ్రా గా పిలిచే గిరినాగులు తూర్పు కనుమల్లో ఎక్కువుగా ఉంటాయని ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటి అధ్యక్షుడు మూర్తి తెలిపారు. జనావాసాల్లోకి ఇవి వచ్చినప్పుడు సంరక్షించే బాధ్యతను తమ సంస్థ చేపట్టిందన్నారు. అటవీశాఖ సహకారంతో పొలాల్లోకి, జనావాసాల్లోకి వచ్చిన ఈ పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదులుతున్నామన్నారు. ఈ పాముల సంరక్షణ కోసం తాము చేస్తున్న ప్రచారం ఫలితాన్నిస్తోందని, ఇంతకుముందులాగా వీటిని చంపకుండా.. తమకు సమాచారం ఇస్తున్నారని చెప్పారు. చీడికాడలో స్థానికంగా ఉండే వాలంటీర్లు శివ, చిన్నా దీనిని పట్టుకున్నారని తెలిపారు. ఇది అత్యంత విషపూరితమైనది. సాధారణంగా కాటు వేయదు. తనకు ప్రమాదం అని భావించినప్పుడే మనుషులకు హాని తలపెడుతుందన్నారు.
ఇదీ చదవండి: 14 అడుగుల పొడవైన గిరి నాగు పట్టివేత