High Court comments on pollution in coastal areas: విశాఖపట్నంలో ఏ మేరకు మురుగు, వ్యర్థాల ఉత్పత్తి, సముద్ర తీర ప్రాంతంలో ఎంత కాలుష్యం కలుస్తోంది, వాటి నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి... తదితర అంశాలపై చర్చించేందుకు నిపుణుల కమిటీతో సమావేశం నిర్వహించాలని హైకోర్టు (High Court ) పేర్కొంది. ఈ మేరకు చర్యలలు చేపట్టాలంటూ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్‌మెంట్ అథార్టీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.
హైకోర్టులో పిల్ దాఖలు: విశాఖ సముద్ర తీర ప్రాంత రసాయనాలతో కలుషితం అవ్వడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ రాజేంద్రసింగ్, విశాఖపట్నానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ (Justice Dheeraj Singh Thakur), జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సముద్ర తీర ప్రాంతంలో కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది.
సముద్ర తీరంలో కాలుష్యం చేరకుండా ఎలాంటి చర్యలు: విశాఖ, కాకినాడ తీరప్రాంతలపై అధ్యయనం చేసి తగిన సూచనలు చేసేందుకు నిపుణులతో కమిటీ వేయాలని పిటిషనర్లు కోరారు. పరవాడ ఔషధ కంపెనీల నుంచి విష రసాయనాల్ని సముద్ర తీరం, సమీపంలోని చెరువుల్లోకి విచక్షణారహితంగా విడుదల చేస్తున్నారన్నారు. తీరంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయన్నారు. తీర ప్రాంతం వృక్షాలు, జంతుజాలానికి, మత్స్యకారుల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. విశాఖలో ఎంత మేరకు మురుగు, వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి, ప్రస్తుతం ఉన్న 18 ఎస్‌టీపీ (వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు)లు సరిపోతాయా? వాటి సామర్థ్యం ఎంత, భవిష్యత్తు అవసరాలకు ఇంకా ఏమైనా అవసరమా? సముద్ర తీరంలో కాలుష్యం చేరకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు, వీఎంఆర్‌డీఏ (VMRDA) కమిషనర్‌తో కమిటీని ఏర్పాటు చేసింది.
రుషికొండపై ఏపీటీడీసీ ఉల్లంఘనలకు పాల్పడింది: కేంద్రానికి విశ్రాంత ఐఏఎస్ లేఖ
వ్యర్థాలపై అధ్యయనం అనంతరం నివేదిక: ఇటీవల జరిగిన విచారణలో వీఎంఆర్‌డీఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేంద్ర పీసీబీ నుంచి శాస్త్రవేత్త డి.సౌమ్య, ఏపీ పీసీబీకి చెందిన పర్యావరణ ఇంజనీర్ నాగిరెడ్డి, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌తో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ త్వరలో సమావేశం కానుందన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సమావేశం నిర్వహించి, వ్యర్థాలపై అధ్యయనం అనంతరం నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అమరావతి అసైన్డ్ భూముల కేసు - సీఐడీ పిటిషన్‌పై హైకోర్టు విచారణ 22కు వాయిదా