Global Tech Summit: విశాఖలో వచ్చే నెల 3,4 తేదీలలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తుందని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కాస్మోపాలిటన్ సిటీగా పేరొందిన ఈ నగరం ఐటీతోపాటు, ఇతర పరిశ్రమల స్థాపించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఐటీ విభాగంలో శిక్షణ పొందిన యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు.
పల్సస్ ఐటీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దేశంలోని పలు ప్రధాన నగరాలలో గ్లోబల్ టెక్ సమ్మిట్లు నిర్వహిస్తోంది. విశాఖలో రెండు రోజులు పాటు నిర్వహించనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ కి వివిధ విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, దేశ విదేశాల్లోని దిగ్గజ ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వచ్చే రెండు నెలల్లో ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఇక్కడ నుంచి విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, తిరుపతి అనంతపురంలలో ఇప్పటికే ఐటీ పార్కులను ఏర్పాటు చేశామని, భోగాపురంలో త్వరలోనే కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. విశాఖలోని ఋషికొండ వద్ద ఏర్పాటయ్యే అధాని డేటా సెంటర్ కి సీఎం జగన్ వచ్చే నెల మూడవ తేదిన శంకుస్థాపన చేయనున్నారన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యమని , ఏపీ డిజిటల్ హెల్త్ కేర్ లో విప్లవాత్మక మార్పులకి నాంది కాబోతోందన్నారు. టెక్నాలజీ సహకారంతో రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి అవకాశాలు ఉన్నాయన్న ఆమె డిజిటల్ హెల్త్ కేర్ ద్వారా మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు చేరుతాయని వివరించారు.
ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ, గ్లోబల్ టెక్ సమ్మిట్ గిరిజన ప్రాంత అభివృద్ధికి ఉపయోగ పడుతుందని, టెక్నాలజీ ద్వారా అటవీ ఉత్పత్తుల కు ప్రాచుర్యం పెరుగుతుందని, జీసీసీ ప్రవేశ పెట్టిన ఈ కామర్స్, ఈ ప్రోక్యూర్మెంట్ విధానం అభివృద్ధికి సూచికగా చెప్పారు. అరకు కాఫీ, తేనె, పసుపు, చింతపండు వంటి ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్ లాంటి ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా ప్రపంచానికి చేరువయ్యాయన్నారు.
గ్లోబల్ టెక్ సమ్మిట్ కన్వీనర్ గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ, ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను ఎంఎన్సీ లకు తెలియజేయడంతో పాటు, ఐటీ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలోని అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ గ్లోబల్ టెక్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు, కంపెనీలు తాము అందిస్తున్న సర్వీసులను చేయనున్న విస్తరణలను వివరించారు.
సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తోంది. విశాఖ, అనంతపురం, తిరుపతిలను ఐటీ నగరాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే ఐటీ రంగానికి అనువైన వాతావరణం ఉండటంతో ఈ నగరాల్ని ఎంపిక చేశాం. - గుడివాడ అమర్నాథ్, మంత్రి
ఇవీ చదవండి