అపార్ట్మెంట్ నిర్మాణం కోసం తీసిన గొయ్యి.. ఓ బాలిక ప్రాణాలు బలి తీసుకుంది. విశాఖ శివారులోని కొమ్మాది సాయిరామ్‌కాలనీలో నివసిస్తున్న లక్ష్మీ.. చేపలు విక్రయిస్తూ కుమార్తె మౌనిక(12)ను పోషిస్తోంది. మౌనిక చంద్రంపాలెం పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సోమవారం కొమ్మాది జీసీసీ లేఅవుట్‌లో చేపల విక్రయానికి లక్ష్మీ వెళ్లగా.. భోజనం తీసుకురావాలని కుమార్తెకు చెప్పింది. మౌనిక భోజనం తీసుకుని తన తల్లి వద్దకు బయల్దేరింది. దారిలో ఓ అపార్టుమెంట్ నిర్మాణానికి గోతులు తవ్వారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గోతుల్లో వర్షపు నీరు చేరింది. బాలిక గొయి పక్క నుంచి వెళ్తుండగా, ప్రమాదవశాత్తు కాలిజారి ఒక్కసారిగా అందులో పడిపోయింది. నీరు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా కిందకు జారిపోయి మట్టిలో కాళ్లు కూరుకుపోయి మృతిచెందింది.
స్థానికులు గమనించి మౌనికను బయటకు తీశారు. అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న తల్లి లక్ష్మీ సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యింది. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణానికి తీసిన గోతులను పరిశీలించారు. అనంతరం పంచనామా నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: