విశాఖలో రెండో రోజు ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ జరుగుతోంది. జీవీఎంసీ సమావేశ మందిరంలో గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలు, వివిధ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా కమిటీ భేటీ అయింది. ఎల్‌జీ దుర్ఘటన ప్రభావిత ప్రాంతాలలో ఎంపిక చేసిన 21 మంది గ్రామస్తులు సమావేశంలో పాల్గొన్నారు. ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా లేవని తమను లోనికి అనుమతించ లేదని మృతుల బంధువులు వాపోయారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని.. కమిటీకి అయినా గోడు వెల్లబోసుకోవడానికి వచ్చామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొమ్మసిల్లిన మహిళ
జీవీఎంసీ ప్రవేశ ద్వారం వద్ద ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. బాధితురాలు ఎల్‌జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన కనకరాజు భార్య. కమిటీ సభ్యులను కలిసేందుకు వచ్చిన కనకరాజు భార్యను అధికారులు అనుమతించలేదు. గంట సేపు జీవీఎంసీ ద్వారం వద్ద కనకరాజు కుటుంబ సభ్యులు వేచి ఉన్నారు. అలసిపోయిన బాధితురాలు సొమ్మసిల్లి పడిపోయింది.
తమకు సరకులు, వైద్య సేవలు అందించాలని కమిటీని బాధిత గ్రామస్థులు కోరారు. హెల్త్ కార్డ్ ఇచ్చి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలని అన్నారు.
కంపెనీపై ఆధారపడిన వారికి ఉపాధి కల్పించాలని గ్రామ ప్రతినిధులు కమిటీని అడిగారు.
ఇదీ చదవండి